విశ్వనగరంగా రూపొందుతున్న గ్రేటర్ హైదరాబాద్లో అత్యాధునిక హంగులతో వెయ్యి బస్‌షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. దిల్సుఖ్నగర్లో నూతనంగా నిర్మించిన ఆరు ఆధునిక బస్‌షెల్టర్లను మేయర్ ప్రారంభించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఏసీ, వైఫై, ఏటీఎం, సీసీటీవీ, మొబైల్ చార్జింగ్, టాయిలెట్‌లను ఈ ఆధునిక బస్‌షెల్టర్లలో ఏర్పాటు చేస్తున్నామని మేయర్ వివరించారు. ఇప్పటికే 292 బస్‌షెల్టర్లను నగర వాసులకు అందుబాటులోకి తెచ్చామన్నారు.
పీపీపీ పద్దతిలో ఏర్పాటు చేసిన ఏసీ బస్‌షెల్టర్లను అడ్వాన్స్‌డ్ బస్‌షెల్టర్లుగా నిర్మించామని... కేవలం పాశ్చత్య దేశాలలోని ప్రముఖ నగరాల్లో మాత్రమే ఈ విధమైన బస్ షెల్టర్లు ఉన్నాయని పేర్కొన్నారు. కొన్నింటిలో డస్ట్‌బిన్‌లు, టాయిలెట్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, మంచినీటి సౌకర్యం, వైఫై, ఫ్యాన్లు, టికెట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏసీ బస్ షెల్టర్లలో భద్రత కోసం సెక్యురిటీగార్డులను కూడా నియమించామని... ఈ అత్యాధునిక బస్‌షెల్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా... ప్రముఖ నగరాల్లో మాదిరిగా హైదరాబాదీలకు మెరుగైన సౌకర్యం ఏర్పడుతోందని మేయర్ రామ్మోహన్ తెలిపారు.