కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న చేనేత శాఖ నేత దుస్తులతో మాస్కుల తయారీకి శ్రీకారం చుట్టింది. లాక్‌డౌన్ వేళ... ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న మహిళలతో మాస్క్‌లను కుట్టిస్తూ అండగా నిలుస్తోంది. గుండ్ల పోచంపల్లి, లంగర్‌హౌజ్, నాగోల్, మెహాదీపట్నం ప్రాంతాల్లో వీటిని తయారు చేయిస్తోంది.
వంద శాతం కాటన్ దుస్తులతో రెండు రకాల మాస్క్‌లను సిద్ధం చేస్తున్నారు. డబుల్ లేయర్ కాటన్ మాస్క్‌కు రూ.20, పోచంపల్లి ఇక్కత్, కలంకారీ ఫ్యాబ్రిక్ డబుల్ లేయర్ మాస్క్‌కు రూ. 40లు నిర్ణయించి అమ్మకాలు జరుపుతున్నారు. జంట నగరాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండేలా నాంపల్లిలోని చేనేత భవన్‌లోని టెస్కోలో వీటిని విక్రయిస్తున్నారు. పలు సూపర్ మార్కెట్లలో కూడా అందుబాటులో ఉంచేందుకు అధికారులు సన్నాహులు చేస్తున్నారు. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఉచిత మాస్క్‌లను తయారు చేస్తున్నామని... వీటిని ప్రతి జిల్లాల్లోని చేనేత కుటుంబాలకు అందిస్తామని చేనేత అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: కదలనిమగ్గం... నిండని కడుపులు