మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటిరోజే అధికారులతో సమీక్షలు నిర్వహించి కేటీఆర్ బిజీబిజీగా గడిపారు. ఉదయం పురపాలకశాఖ అధికారులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి విషజ్వరాలపై సమీక్షించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జీహెచ్‌ఎంసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతన్న అభివృద్ధి పనులపై బల్దియా అధికారులతో సమీక్షించారు.
దోమల నివారణ...
హైదరాబాద్‌లో పారిశుద్ధ్యం మెరుగు పరుచుకోవడానికి... దోమల నివారణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంత్రులు నిర్ణయించారు. వాతావరణంలో మార్పు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫివర్స్ వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లా ఆసుపత్రులు సందర్శిస్తూ... క్షేత్రస్థాయిలో పరిస్థితులపై చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. విషజ్వరాలపై ప్రజలు ఆందోళన చెందవద్దని కేటీఆర్ సూచించారు. నగరంలో సీజినల్ వ్యాధులు నివారించేందుకు ప్రత్యేక క్యాలెండర్ రూపోందించినట్లు ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో శానిటేషన్ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుకోవాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వైద్యాధికారులు, ప్రజా ప్రతినిధులు ఉదయం 6 గంటల నుంచే ఫిల్డ్‌లో ఉండాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాఠశాలలు, కళాశాలలు, బస్తీలు, అపార్టుమెంట్లలో అధికారులు పర్యటించాలని నిర్ణయించారు.
వారికి జరిమానా మంచిదే...
నగరంలో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తామన్న కేటీఆర్... మంత్రిమండలి అనుమతితో ప్రతి డివిజన్‌కు రెండు బస్తీ దవాఖానాలతో పాటు సాయంత్రం క్లీనిక్‌లు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లఘించి పాదాచారులకు ఇబ్బంది కలిగించే వారికి జరిమానా వేయడం మంచిదేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నగరంలో ఎక్కడపడితే అక్కడ చెత్త వేసే వారికి అవసరమైతే జరిమానా విధిస్తామన్నారు. ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. మీడియా నిర్మాణాత్మక విమర్శలు చేయాలని సూచించారు.
ఇదీ చూడండి: నిధులు దండిగా... వ్యవసాయం ఇక పండగ!