Fisheries Officer Suspended: ఖమ్మం జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలాబానుపై సస్పెన్షన్ వేటుపడింది. మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల్లో సభ్యుల నమోదు ప్రక్రియలో నిబంధనలు ఉల్లంఘించిన షకీలాభానుపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం శాఖపరమైన విచారణకు ఆదేశించింది. అనర్హులకు సభ్యత్వాలు ఇచ్చారని శాఖాపరమైన విచారణలో వాస్తవాలు వెల్లడయ్యాయి.
సొసైటీల్లో మత్స్యకారుల సభ్యత్వ నమోదులో నిబంధనలు ఉల్లింఘించినట్లు తేలింది. రాష్ట్రంలో మత్స్య సొసైటీల్లో సభ్యత్వ నమోదు పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులోభాగంగా ఈ ఏడాది పెద్ద మత్స్యపారిశ్రామిక సంఘాలను చిన్నవిగా చేసి సభ్యత్వ నమోదు చేపట్టాలని... పశుసంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. గతంలో ఉన్న నిబంధనలు సరళతరం చేసినందున సభ్యత్వ నమోదులో అనర్హులకు చోటు కల్పించవద్దని... ఎక్కడైనా అలాంటి ఫిర్యాదులు వస్తే సహించబోమని హెచ్చరించారు.
ఈ తరుణంలో ఖమ్మం జిల్లా మత్స్యశాఖ అధికారి షకీలా బానుపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో సస్పెన్షన్ వేటువేసినట్లు రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ లచ్చీరాం భూక్యా వెల్లడించారు. ఆ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'కేంద్రానికి చేతకాకుంటే రాష్ట్రాలకు అధికారం అప్పగించండి'