Jagan on Special Status for AP : జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఏపీకి ప్రత్యేక హోదాతోనే మనుగడ అని నినదించారు. 2014-19 మధ్య కాలంలో హోదా అంశంపై ఎక్కడలేని దూకుడు ప్రదర్శించారు. ప్రత్యేక హోదాతోనే అద్భుతాలు జరుగుతాయన్నారు. ఉద్యోగాల విప్లవమే తెస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 25 మంది వైకాపా అభ్యర్థుల్ని గెలిపిస్తే... కేంద్రం మెడలు వంచుతానన్నారు. రాష్ట్రంలో నిరసనలు, సభలు, సమావేశాలు, విద్యార్థులతో యువభేరీలు నిర్వహించారు. నిరాహారదీక్ష చేశారు. కేంద్రంపై పోరాడాలని ప్రజలను, యువకులను రెచ్చగొట్టారు. ఎంపీల రాజీనామాలు, దిల్లీలో నిరసనలతో కేంద్రంపైనా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై సంతకం పెట్టాకే మద్దతిస్తామని పదేపదే స్పష్టంచేశారు. రాష్ట్రంలో 2019లో జరిగిన ఎన్నికల్లో 151 సీట్లు గెలిచి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ప్రత్యేక హోదాపై జగన్ కాడి పడేశారు.
కేంద్రంపై పోరాడడం లేదు సరికదా, ఒత్తిడి తేవకపోవడానికీ సాకులు చెబుతున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే ప్రధాని మోదీతో జరిగిన తొలి సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలోనే ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చేశారు. అదేమంటే 2019 ఎన్నికల్లో కేంద్రంలో భాజపాకి 250 కంటే ఎక్కువ స్థానాలు వచ్చాయని, వారికి మన అవసరం లేదు కాబట్టి హోదా కోసం ఒత్తిడి తేలేమన్నారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీలో ఒక తీర్మానం మాత్రం చేసి, కేంద్రానికి పంపి... అంతటితో తమ పని అయిపోయిందన్నట్టుగా ఊరుకున్నారు.
‘కేంద్రంలో భాజపాకి సంపూర్ణ ఆధిక్యత రాకపోతే ఏపీ ప్రయోజనం పొందేది. ఈ రోజు కాకపోయినా రేపైనా కేంద్రం మనపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతిస్తామని చెబుతాం’ అని ఒక సందర్భంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రయ్యాక ఇప్పటి వరకు సుమారు 15 సార్లు దిల్లీ వెళ్లొచ్చిన జగన్... ప్రత్యేక హోదా సహా, విభజన హామీల్లో ఎన్ని సాధించారు? లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి వైకాపాకి 31 మంది ఎంపీలున్నా కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదన్న ప్రశ్నలు వివిధ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. పైగా గత మూడేళ్లలో వ్యవసాయ చట్టాలు సహా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులన్నిటికీ వైకాపా మద్దతిచ్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతిస్తామన్న షరతు ఎప్పుడూ పెట్టలేదు. తనపై ఉన్న కేసులు, ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టేశారని విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నా... ఆయన నుంచి మౌనమే సమాధానమైంది.
'తెలుగుతల్లి బిడ్డలందరికీ ప్రత్యేక హోదాయే సంజీవని. అదే శ్రీరామరక్ష. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు, పన్ను రాయితీలు. అడ్డంగా నరికిన మన రాష్ట్రానికి ప్రత్యేక హోదాయే ప్రాణవాయువు...! కాబట్టి ఆత్మాభిమానధనులైన అయిదున్నర కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలారా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అన్యాయాలకు వ్యతిరేకంగా జైఆంధ్రప్రదేశ్ అంటూ ప్రత్యేక హోదా కోసం గర్జించండి. దిక్కులు పిక్కటిల్లేలా సింహనాదాలు చేయండి. తెలుగువాడి గర్జనను దిల్లీ వరకు ప్రతిధ్వనింపజేయండి. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు. మోసం చేస్తున్న ప్రభుత్వాలపై పోరాడి దీన్ని సాధించుకుందాం రండి.' - 2015 సెప్టెంబరు లో తిరుపతిలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్ విడుదల చేసిన నాలుగు పేజీల కరపత్రంలో ‘గర్జన’ ఇది
'వాళ్లనూ వీళ్లనూ ఎవర్నీ నమ్మొద్దు. వాళ్లంతా మోసం చేశారు. వైకాపాకి పూర్తిగా మద్దతివ్వండి. మొత్తం 25కి 25 ఎంపీల్ని నాకివ్వండి. అప్పుడు కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా... ఏపీకి ప్రత్యేక హోదా ఎవరిస్తారో, ఆ దస్త్రంపై ఎవరు సంతకం పెడతారో వారికే మద్దతిస్తాం.' - 2018 మార్చి 8న విలేకరుల సమావేశంలో జగన్
'జగన్ మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా, ఎన్నికలైన తర్వాత మరో మాదిరిగా, ఎన్నికల కోసం మరోలా ఉండే వాడు కాదు మీ జగన్. మీ బిడ్డకు నిజాయతీ ఉంది. మీ బిడ్డకు నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో... అదే చేస్తాడు.' - ఏపీ ప్రభుత్వం మంగళవారం పత్రికల్లో ఇచ్చిన భారీ ప్రకటనల్లో ముఖ్యమంత్రి ఉద్ఘాటన ఇది
హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని చెప్పలేరా? : ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్రపతి ఎన్నికల రూపంలో వైకాపాకి అద్భుతమైన అవకాశం వచ్చింది. రాష్ట్రపతి ఎన్నిక భాజపాకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. మెజార్టీ విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తుండటంతో... ఎన్నిక నువ్వా.... నేనా? అన్నట్టు జరిగేలా కనిపిస్తోంది. ఈ దశలో భాజపాకి వైకాపా మద్దతు అత్యంత కీలకంగా మారింది. లోక్‌సభలో బలాబలాల పరంగా 22 మంది ఎంపీలతో నాలుగో పెద్ద పక్షంగా ఉంది. రాజ్యసభలో 9 మంది ఎంపీలున్నారు. అసెంబ్లీలోనూ ఆ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
మొత్తంగా వైకాపాకి రాష్ట్రపతి ఎన్నికల్లో 45,525 ఓట్లు ఉన్నాయి. ప్రతి ఓటూ కీలకమైన తరుణంలో... భాజపా బలపర్చిన అభ్యర్థి ఎన్నిక సాఫీగా జరగాలంటే వైకాపా మద్దతు తప్పనిసరి. వైకాపా ఇప్పుడు ఏం కోరినా కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఈ సువర్ణావకాశాన్ని వైకాపా వినియోగించుకోవాలని, హోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిస్తామని షరతు పెట్టాలన్న డిమాండ్ వివిధ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది.
విపక్ష నేతగా.. నాడు జగన్ ఏమన్నారంటే..
- ప్రత్యేక హోదా మన హక్కు. దాన్ని సాధించు కోవడానికి మీరంతా నాతో కలసి రండి. ప్రత్యేక హోదా సాధిస్తే దేశంలోనే నంబరు-1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోతుంది. - 2015 సెప్టెంబరు 23న విశాఖలో యువభేరిలో జగన్
- ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వస్తే పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి వస్తాయి. వాటి ద్వారా భారీగా పెట్టుబడులు వచ్చి లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా హైదరాబాద్‌లా అభివృద్ధి చెందుతుంది. - 2016 మే 10న కాకినాడలో ప్రతిపక్ష నేత హోదాలో జగన్
- ప్రత్యేక హోదాతో లక్షల్లో ఉద్యోగాలు, రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉద్యోగాల విప్లవం రావాలి. అది ప్రత్యేక హోదాతోనే సాధ్యం.- 2016 డిసెంబరు 19న విజయనగరంలో నిర్వహించిన యువభేరిలో జగన్
- జల్లికట్టు ఆట కోసం తమిళనాడు అంతా ఏకమైంది. ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య. సీఎం సిద్ధంగా ఉంటే అందరం దిల్లీ వెళదాం. కేంద్రం కాదంటే 25 మంది ఎంపీలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళదాం. దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చూద్దాం. రాదనుకున్న తెలంగాణ వచ్చింది. పోరాటం చేస్తే కొన్నాళ్లకయినా ప్రత్యేక హోదా సాధించవచ్చు.- 2017 జనవరి 26న వైకాపా కార్యాలయంలో జగన్
- వైకాపా ఎంపీలు అయిదుగురూ ఇప్పటికే రాజీనామా చేశారు. మీ (తెదేపా) ఎంపీలు అందరితోనూ రాజీనామా చేయించండి. మా ఎంపీలను నేను పంపిస్తా. 25 మందిని నిరాహారదీక్షకు కూర్చోబెడదాం. కేంద్రం ఎందుకు దిగిరాదో, దేశం మొత్తం ఎందుకు ఏపీ వైపు చూడదో చూద్దాం. - 2018 జులై 18న ప్రతిపక్ష నేత హోదాలో చేసిన సవాల్
- ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాం. సాధించే వరకు చేస్తూనే ఉంటాం. హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. - 2019లో వైకాపా మేనిఫెస్టోలో హామీ
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక..: గత మూడేళ్లలో వివిధ సందర్భాల్లో ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.. ఎన్‌డీఏకి వచ్చిన సీట్లు ఏ 250కో పరిమితమైతే బహుశా కేంద్రంపై ఇంతగా ఆధారపడాల్సి వచ్చేది కాదేమో. 250 సీట్లు దాటకూడదని దేవుడిని చాలా ప్రార్థించాను. ఏం చేద్దాం మన ఖర్మ అనుకోవాలి. వాళ్లకు మన సహాయం అవసరం లేదు. వాళ్లకు 250 సీట్లు మాత్రమే వచ్చి ఉంటే, ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై సంతకం పెట్టిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితిలో ఉండేది. ప్రత్యేక హోదా మన హక్కు. దాని కోసం ప్రయత్నం చేస్తూ పోవాలి. ఈ ఐదేళ్లలో దేవుడు ఆశీర్వదిస్తే 30-40 సార్లు ప్రధానిని కలుస్తానేమో. కలసిన ప్రతిసారీ ప్రత్యేక హోదా అడుగుతూనే ఉంటాను.
రాష్ట్రంలో 151 సీట్లు గెలిచాక, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే 2019 మే 26న దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరుల సమావేశంలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇవీ..
- ప్రత్యేక హోదా మనకు కాస్త దూరంగానే ఉంది. ఈ రోజు కాకున్నా రేపైనా కేంద్రం మనపై ఆధారపడే స్థితి వస్తుంది. ఆ రోజున ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తేనే మద్దతిస్తామని చెబుతాం. ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా హోదా వచ్చి తీరుతుంది. 2020 మే 28న ‘మన పాలన- మీ సూచన’ కార్యక్రమంలో సీఎం జగన్
- ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని పదేపదే అడగడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు. లోక్‌సభలో వారికి కావాల్సిన పూర్తి ఆధిక్యత ఉంది. దేవుడి దయతో ఈ పరిస్థితులు ఎప్పుడో ఒకప్పుడు మారతాయనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. - 2021 జూన్ 18న జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా సీఎం ఆశాభావం