ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను జూన్ 15న విడుదల చేయాలని బోర్డు భావిస్తోంది. మొదటి సంవత్సరం ఫలితాలను జూన్ 20 నాటికి ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈనెల 12న ప్రారంభమైన జవాబు పత్రాల మూల్యాంకనం ఆదివారంతో ముగియనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు.
తుది దశకు ప్రక్రియ..
రాష్ట్రవ్యాప్తంగా 33 మూల్యాంకన కేంద్రాల్లో తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులకు చెందిన 53.5 లక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ తుది దశకు చేరింది. సుమారు 15వేల మంది అధ్యాపకులు మూల్యాంకనంలో పాల్గొన్నారు. తుది పరిశీలన ఆదివారం పూర్తవుతుందని జలీల్ తెలిపారు.
సోమవారం నుంచి..
మూల్యాంకనం పూర్తయిన సమాధాన పత్రాల స్కానింగ్ ప్రక్రియ సోమవారం నాటికి ముగిసే అవకాశం ఉంది. సోమవారం నుంచి కంప్యూటర్లలో మార్కుల నమోదు వంటి సాంకేతిక ప్రక్రియ నిర్వహించనున్నారు. గతేడాదిలాగా సాంకేతిక లోపాలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు జలీల్ పేర్కొన్నారు. ఈ ఏడాది సాంకేతిక ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ ఐటీ విభాగానికి చెందిన సీజీజీ పర్యవేక్షిస్తోంది. ఫలితాలు వెల్లడైన కొన్ని రోజుల్లోనే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ చెప్పారు.
ఇవీ చూడండి: జూన్ 30 వరకు లాక్డౌన్ 5.0- కీలక మార్గదర్శకాలు ఇవే