Nampally Court on Kangana Ranaut: బాలీవుడ్ నటి కంగన రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలపై కేసునమోదు చేసి దర్యాప్తు జరపాలని హైదరాబాద్ నాంపల్లి కోర్టు ఆదేశించింది. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది. దేశ స్వాతంత్య్రంపై గత నెలలో కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు తనతో పాటు దేశ ప్రజలందరి మనోభావాలను దెబ్బతీశాయంటూ న్యాయవాది కరమ్ కొమిరెడ్డి నాంపల్లి కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. కరమ్ ఫిర్యాదుపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. ఐపీసీ 504, 505 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి, నివేదిక సమర్పించాలని సైఫాబాద్ పోలీసులను ఆదేశించింది.
నవంబర్ రెండో వారంలో ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కంగన.. 'భాజపా నేతృత్వంలోని మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014లోనే భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం లభించింది' అని (kangana comments on independence) వ్యాఖ్యానించారు. 1947లో వచ్చిన స్వాతంత్య్రం 'భిక్ష' మాత్రమేనని అభిప్రాయపడ్డారు. అలా వచ్చినదాన్ని స్వేచ్ఛ అంటామా? అని ప్రశ్నించారు. '1947లో మనకు లభించిన స్వాతంత్య్రం బ్రిటిష్ వారి పాలనకు పొడిగింపు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఆప్ తదితర విపక్షాలతో పాటు కొందరు భాజపా నేతలు సైతం ఆమె వ్యాఖ్యలను తప్పు పట్టారు. కంగనకు ఇటీవల ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: