House Sales in Hyderabad: హైదరాబాద్‌లో ఈ ఏడాది జనవరి-జూన్‌లో 14,693 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 2011 తర్వాత అంతకుమించి ఇళ్ల విక్రయాలు జరిగింది ఇప్పుడే. 2013 నుంచి ఇళ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆరునెలల్లో 4 శాతం ప్రియమయ్యాయి. దేశవ్యాప్తంగా 8 నగరాల్లో రికార్డుస్థాయిలో ఇళ్ల విక్రయాల్లో 60 శాతం వృద్ధి నమోదైంది. తొమ్మిదేళ్ల గరిష్ఠ స్థాయిలో విక్రయాలు జరిగాయని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. ఐటీ రంగంపై కొవిడ్ ప్రభావం పెద్దగా లేకపోవడంతో హైదరాబాద్‌లో ఇళ్లకు డిమాండ్ కొనసాగుతోందని విశ్లేషించింది. ఇటీవల వరకు గృహ రుణ వడ్డీరేట్లు తక్కువగా ఉండటం కలిసొచ్చిందని పేర్కొంది. మున్ముందు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపింది.
- హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో గృహనిర్మాణ రంగ వాటా 62 శాతంగా ఉంది. కొత్తగా 21,356 ఇళ్లు నిర్మితమవుతున్నాయి. వార్షిక వృద్ధి 28 శాతంగా ఉంది.
కార్యాలయాల లీజింగ్..: 2021 తొలి అర్ధభాగంలో 16 లక్షల చ.అ. మేర కార్యాలయ భవనాల లీజింగ్ జరగ్గా.. 2022 ఇదే సమయంలో 32 లక్షల చ.అడుగులకు పెరిగింది. పూర్తైన నిర్మాణాలు 53 లక్షల చ.అ.కు చేరాయి. వార్షిక వృద్ధి 62 శాతంగా ఉంది. అద్దెలు 3 శాతం పెరిగాయి.
దేశవ్యాప్తంగా రికార్డుస్థాయిలో..
- గృహనిర్మాణంలో దేశంలోని 8 అగ్రశ్రేణి నగరాల్లో తొలి ఆర్నెల్లలో 1,58,705 ఇళ్ల విక్రయాలు జరిగాయి. రికార్డు స్థాయిలో వృద్ధిరేటు 60 శాతంగా నమోదైంది.
- దిల్లీలో 154 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్(95%), బెంగళూరు 80 శాతం, ముంబయి(55%), కోల్‌కతా(39%), పుణె(25%) చెన్నై (21%) నిలిచాయి.
- కార్యాలయ భవనాల లావాదేవీలు 2.53 కోట్ల చ.అ. విస్తీర్ణం మేర జరిగాయి. 107 శాతం వృద్ధి కన్పించింది.
మున్ముందు సవాళ్లు...
"ఈ ఏడాది తొలి ఆరునెలలు మార్కెట్ బాగున్నప్పటికీ.. ద్రవ్యోల్బణం, గృహ రుణ వడ్డీరేట్లు మున్ముందు మార్కెట్‌ను ఎలా ప్రభావితం చేస్తుందో చూడటం చాలా కీలకం. పెరిగిన జీవన వ్యయం, పెరుగుతున్న ఇళ్ల ధరలు, గృహరుణాల వడ్డీరేట్లు కొనుగోలుదారుల స్థోమతను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది" -శిశిర్ బైజల్, నైట్ ఫ్రాంక్ ఇండియా ఛైర్మన్
ఇవీ చూడండి: