హైదరాబాద్‌లో చిన్నా పెద్దా ఆస్పత్రులు 4000 వరకు ఉన్నాయి. కరోనాకు వైద్యం అందించాలంటే వైద్య ఆరోగ్య శాఖ అనుమతి తప్పనిసరి. 20 పడకలు ఆపైన ఉండి, దరఖాస్తు చేస్తే ఆ శాఖ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం మూడు వేల వైద్యశాలల్లో ఈ వైద్యం లభిస్తోంది. మరో 500 వరకు చిన్న వైద్యశాలలు అనధికారికంగా పడకలను ఏర్పాటు చేశాయి. వీటిలో పూర్తిస్థాయిలో వైద్యులు లేరు.. ఆక్సిజన్ సౌకర్యం లేదు. చనిపోతున్న వారి సంఖ్య ఇలాంటి చోట్ల అధికంగా ఉంటోంది. ఈ చిన్న ఆస్పత్రులను ఆదర్శంగా తీసుకున్నారో ఏమోగానీ పలు డయాగ్నస్టిక్ కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా కరోనా వైద్య కేంద్రాలుగా మారిపోయాయి.
ఎక్కడెక్కడ అంటే..
దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మాదాపూర్ ప్రాంతాల్లోని కొన్ని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో..
నగరంలో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్ని రకాల పడకలకు భారీ అవసరం ఉంది. వెంటిలేటర్, ఆక్సిజన్ పడకలకు డిమాండ్ మరింత ఎక్కువైంది. వెంటిలేటర్ పడకకు రోజుకు రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్న ఆస్పత్రులున్నాయి. దీంతో బాధితుల దృష్టి చిన్న ఆస్పత్రులపై మళ్లింది. ఇంటి కంటే వైద్యులు పర్యవేక్షణలో ఉండడం మేలన్నది చాలామంది ఉద్దేశం. ప్రభుత్వ పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను రెండింతల మేర తగ్గించడంతో అనేకమంది డయాగ్నస్టిక్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు. ఈ పరిణామమే డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వాహకుల్లో కొత్త ఆలోచనను రేకెత్తించింది. తామే కొన్ని పడకలను ఏర్పాటు చేసి కొవిడ్‌కు వైద్యం మొదలుపెడదామని భావించాయి.
కొన్ని కేంద్రాలు భవనాలను అద్దెకు తీసుకుని 20-50 పడకలను ఏర్పాటు చేసి బాధితులను చేర్చుకుంటున్నాయి. అక్కడ వైద్యులను నియమించలేదు. సిబ్బందితోనే వైద్యం చేయిస్తున్నాయి. కొన్ని చోట్ల మాత్రం ఉదయం ఓ వైద్యుడు వచ్చి పలానా మందులు వాడండని చెప్పి వెళ్లిపోతున్నాడు. ఇందుకు రోజుకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. ఏసీ పడకలైతే మరింత ఎక్కువ తీసుకుంటున్నారు. వైరస్ సోకిన మొదటి దశలో నిర్లక్ష్యం వహిస్తే వారం రోజుల్లోనే ఊపిరితిత్తులు దెబ్బతిని ఆక్సిజన్ స్థాయిలు 90 శాతానికి తరువాత 80 శాతానికి పడిపోతున్నాయి. ఇటువంటి వారికి తక్షణం ఆక్సిజన్ అందించాలి. అవసరమైతే వెంటిలేటర్ పెట్టాలి. వైద్యులు లేని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో చేరిన నాలుగైదు రోజులకే కొందరిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతున్నాయి. ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది.
ఇదొక నిదర్శనం
పక్షం రోజుల కిందట దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ డయాగ్నస్టిక్ కేంద్రంలో కరోనాకు వైద్యం ప్రారంభించారు. చేరిన బాధితుడికి మందులు సరిగా ఇవ్వకపోవడంతో నాలుగో రోజుకు ఆక్సిజన్ స్థాయిలు 80 శాతానికి పడిపోయాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకలు దొరక్క గాంధీ దవాఖానాకు తరలించారు. వైద్య ఆరోగ్యశాఖ మేల్కొని నిబంధనలకు విరుద్ధంగా వెలసిన వైద్య కేంద్రాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: అక్కడ ప్రతి ఇద్దరిలో ఒకరికి పాజిటివ్!