Rajiv Gandhi International Airport: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ గ్రూప్ సంస్థే మరో 30 ఏళ్లు నిర్వహించనుంది. జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (జీహెచ్‌ఐఏఎల్) సంస్థకు విమానాశ్రయ నిర్వహణ హక్కులు.. 2038 మార్చి 23వరకు ముగిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహణ హక్కుల గడువును మరో 30 ఏళ్ల పాటు పొడిగించాలని జీహెచ్‌ఐఏఎల్ దరఖాస్తు చేసుకుంది. దీనికి కేంద్ర ప్రభుత్వ పౌరవిమానయాన శాఖ తన ఆమోదాన్ని తెలియజేస్తూ లేఖ పంపినట్లు జీహెచ్‌ఐఏఎల్ ప్రకటించింది.
మరో 30 ఏళ్లు అంటే.. 2068 వరకూ ఈ విమానాశ్రయం జీహెచ్‌ఐఏఎల్ నిర్వహణలో ఉండనుంది. ప్రభుత్వంతో 2004, డిసెంబరు 30న కుదిరిన ఒప్పంద పత్రం (కన్సెషన్ అగ్రిమెంట్) ప్రకారం ఈ పొడిగింపు లభించినట్లు వివరించింది. ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీఐఎల్) అనుబంధ సంస్థ జీహెచ్‌ఐఏఎల్ నిర్మించి 2008 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత ఏటా 1.20 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఈ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సిద్ధం చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న విస్తరణ పూర్తయితే ఈ విమానాశ్రయం నుంచి ఏటా 3 కోట్ల మందికి పైగా ప్రయాణికులు వచ్చివెళ్లే అవకాశం ఉంది. అంతేగాక ఏటా 1.50 లక్షల టన్నుల సరకు రవాణాను నిర్వహించగల సామర్థ్యం రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి ఉంది.
ఇవీ చూడండి: