2020.. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, డిసెంబరు..! ఈ నాలుగు నెలలు భాగ్యనగరంలో మిగిల్చిన నష్టం అంతాఇంతా కాదు. వేల ఇళ్లు నీట మునిగాయి.. లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.. అయినా బల్దియా అధికారులకు కనీసం చీటకుట్టినట్లు లేదు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అదే నిర్లక్ష్యం(GHMC Negligence). భూగర్భ డ్రైనేజీలు, సీసీరోడ్లు, పైపులైన్ల లీకేజీలు, కేబుళ్లు.. ఇలా ఒక్కో కారణంతో ఒక్కోచోట ఎక్కడికక్కడ రోడ్లను తవ్వి వదిలేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. ఫిర్యాదులిచ్చినా కదలిక లేదని నగరవాసులు మండిపడుతున్నారు.
మొన్నే వేసి.. అప్పుడే తవ్వేసి..
మొన్నే వేసి.. అప్పుడే తవ్వేసి.. నగరంలో 9,103 కి.మీ. రోడ్లున్నాయి. పనుల కోసం తరచూ రోడ్లు తవ్వుతుంటారు. తవ్వాకానికి బల్దియా అనుమతి తీసుకోవాలి. పునరుద్ధరణ బాధ్యతగా చేపట్టాలి. ఇవేవీ పట్టని ఇతర విభాగాలు నెలల తరబడి పనులు కొనసాగిస్తున్నాయి.
అయినా మేలుకోలేదు..
ప్రాణాలు పోతేగానీ పట్టదా? గతేడాది తెరిచి ఉన్న డ్రైన్లకు, గుంతలకు ఎందరో చిన్నారులు బలయ్యారు. ఇటీవలె బోయిన్‌పల్లిలో ఓ బాలుడు మృతిచెందినా యంత్రాంగం మేలుకోలేదు. తవ్వకాలు జరిపిన చోట్ల ప్రమాద హెచ్చరిక సూచికలు పెట్టలేదు.
నిర్లక్ష్యానికి సాక్ష్యాలివే!
మీర్‌పేట హెచ్‌బీకాలనీ డివిజన్‌లోని బీకేనగర్ కాలనీ, మల్లాపూర్ డివిజన్‌లోని భవానీనగర్, గ్రీన్‌హిల్స్‌కాలనీ, చిన్న చర్లపల్లి ప్రాంతాల్లో భూగర్భ డ్రైనేజీల కోసం ఎక్కడికక్కడ తవ్వి వదిలేశారు. భవానీనగర్‌లో మూడు నెలలుగా బయట అడుగుపెట్టేందుకు కాలనీవాసులు నరకం చూస్తున్నారు.
భోలక్‌పూర్ నుంచి గంగపుత్రబస్తీ, పద్మశాలీకాలనీ వరకూ దాదాపు 2 కి.మీ. మేర ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రధాన రహదారి. ఇటీవల వేసిన సిమెంటు రోడ్డును పైపులైన్ల మరమ్మతుల కోసం తవ్వారు. ఎవరూ పూడ్చకపోగా.. ఆరు నెలలుగా వాహనదారులు, స్థానికులు నరకం చూస్తున్నారు.
ఖైరతాబాద్ డివిజన్ మారుతీనగర్‌లో పైపులైన్‌కు కిందికి ఉందని సీసీ రోడ్డు తవ్వారు. మూడు నెలలు కావస్తున్నా.. పట్టించుకోవడంలేదు.
- ఇదీ చదవండి : స్వీయ జాగ్రత్తలతోనే సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట!