Ramadan at Charminar : రకరకాల వస్త్రాలు, తినుబండారాలు, బిర్యాని ఘుమఘుమలు, ఇరానీ చాయ్ పిలుపులు, అత్తరు సువాసనలు. రంజాన్ మాసంలో హైదరాబాద్ సరికొత్త శోభను సంతరించుకుంది. చార్మినార్ పరిసరప్రాతాల్లో వివిధ రకాల వస్తువులు, దుస్తులకు నెలవైన రాత్రి బజార్ నగరవాసులను ఎంతగానో ఆకర్షిస్తోంది. కేవలం ముస్లిం సోదరులే కాదు.. నగర నలుమూలలు, పలు జిల్లాలు, రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ షాపింగ్ చేస్తారు. ఒక్క షాపింగే కాదు.. రంజాన్ నెలంతా వివిధ రకాల వంటకాల ఘుమఘుమలు రారమ్మంటూ పిలుస్తాయి. రండి...ఆ కోలాహలాన్ని మనం కూడా తిలకిద్దాం.
సందడిగా చార్మినార్ : రెండేళ్లుగా కరోనాతో కనిపించకుండా పోయిన రంజాన్ కళ.... రెండింతల జోరుతో చార్మినార్ చట్టూ సంతరించుకుంది. గాజులు, అలంకార వస్తువులతో సహా అన్ని వైరైటీలను ఈసారి ముందుకు తీసుకొచ్చామని దుకాణాదారులు చెబుతున్నారు. అసలైన షాపింగ్ మజా పొందుతున్నామని చార్మినార్ రాత్రి బజార్ సందర్శకులు చెబుతున్నారు. ఈ సారి ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయని సంబురపడుతున్నారు. నగరవాసులు రంజాన్ రుచులను ఆస్వాదిస్తూ మైమరచిపోతున్నారు. కేవలం రంజాన్ మాసంలోనే దొరికే ప్రత్యేక వంటకాలను తిని ఆహా అంటున్నారు.
సంబురంగా షాపింగ్ : గాజుల తయారీ, అమ్మకాల్లో ఇప్పటికే దేశవ్యాప్తంగా పేరుగాంచిన పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో రంజాన్ పండుగను పురస్కరించుకుని దుకాణ యజమానులు కొత్త కొత్త డిజైన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. హైదరాబాద్ నగరం ముత్యాలు, గాజులకు ప్రసిద్ధి కావడంతో వాటిని ఖరీదు చేసేందుకు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా కొనుగోలుదారులు నగరానికి తరలివస్తున్నారు. రంజాన్ ఉపవాస నెలలో సంప్రదాయబద్దంగా ఉపయోగించే సుర్మా, టోపీలు, సుగంధ ద్రవ్యాలు, అత్తరులు, ప్రత్యేక దుస్తులు, కుర్తా పైజామా వంటి వాటికి రోజురోజుకీ గిరాకీ పెరుగుతోంది. కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటు సరైన రాబడిలేక ఇబ్బందు ఎదుర్కొన్న దుకాణదారులు ఈ ఏడాది వ్యాపారం బాగా సాగుతోందని.. ప్రతి ఒక్కరు చార్మినార్ వచ్చి షాపింగ్ చేయాలని కోరుతున్నారు.
ఆహా ఏమి రుచి : రంజాన్ సమయంలో పాతబస్తీలో దొరికే తినుబండారాలకు ప్రత్యేక స్థానం ఉంది. వంటల సువాసనలతో ఆ ప్రాతమంతా గుబాళిస్తోంది. ముఖ్యంగా పత్తర్ కా ఘోష్, మరగ్, పాయా, హలీం, అచర్ కా ఘోష్, బోటి కబాబ్, షీక్ కబాబ్, చికెన్ 65, చికెన్ మెజెస్టిక్ వంటి మాంసాహార వంటకాలు ఆ ప్రాంతం నుంచి మనల్ని కదలకుండా చేస్తాయి. వీటితో పాటు పలు రకాల మిఠాయిలు ఆహార ప్రియులను అలరిస్తున్నాయి. కొవిడ్ ముందుకంటే ప్రస్తుతం వ్యాపారం బాగా సాగుతోందని దుకాణదారులు చెబుతున్నారు. రంజాన్ అంటే హైదరాబాద్ పాతబస్తీకి ప్రత్యేక స్థానం ఉందని... ఇక్కడికి వచ్చి ఎంతో ఆనందంగా షాపింగ్‌తో పాటు నచ్చిన తినుబండారాలు ఆస్వాదించవచ్చని చెబుతున్నారు. కేవలం రంజాన్ మాసంలో మాత్రమే దొరికే వంటకాలను రుచి చూడాల్సిందేనని సందర్శకులు చెబుతున్నారు.