ఎగుమతి చేసే స్థాయి నుంచి దిగుమతి చేసుకునే దిశగా కేంద్రం... వ్యవసాయ రంగాన్ని తిరోగమనం చెందించారని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర రైతు సంఘం సమావేశానికి ఆయన హాజరయ్యారు. గ్రోత్ రేట్ పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంలో అర్థం లేదని.. అన్ని రకాల ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగడం వల్లనే వృద్ధిరేటు పెరిగిందన్నారు. జనాభా పెరుగుదలకు సరిపడా ఆహారధాన్యాల ఉత్పత్తి మాత్రం పెరగలేదన్నారు. కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి బీడుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలంటే లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు వ్యవసాయానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర పద్దులో.. రైతుల ఆదాయం రెట్టింపు చేసే చర్యలు చేపట్టకుండా.. కార్పొరేట్ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి సాగర్ ఆరోపించారు. గ్రామీణ ఉపాధి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారన్నారు. కేంద్రం తీరుపై ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తామని వెల్లడించారు.
ఇవీచూడండి: 'రైల్వే బడ్జెట్లోనూ తెలంగాణకు అన్యాయం '