ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాలు భేటీ కావడం పట్ల ఎన్నికల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ రిటర్నింగ్ అధికారి ప్రియాంక.. ఉద్యోగ సంఘాలకు ఈనెల 15న నోటీసులు జారీ చేశారు. 24 గంటల లోపల సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఫిర్యాదు ఏంటి..?
టీపీసీసీ ఎన్నికల కన్వీనర్ నిరంజన్... ఈ నెల 9న రిట్నరింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్తో సమావేశమైన అనంతరం పీఆర్సీపై మీడియాతో మాట్లాడారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. 29 శాతం ఫిట్మెంట్ ఇస్తామని, పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచుతామని.. ఇతర సమస్యలను పరిష్కరించడానికి సీఎం సుముఖంగా ఉన్నారని ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో చెప్పడం వల్ల... తెరాస అభ్యర్థి వాణిదేవికి పట్టభద్రుల ఎన్నికల్లో అనుకూలంగా వ్యవహరించినట్లైందని నిరంజన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు రిటర్నింగ్ అధికారి ప్రియాంక అల ఉద్యోగ సంఘాలకు నోటీసులు జారీ చేశారు.
ఉద్యోగ సంఘాలు ఏమన్నాయ్..
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి వారిపై ఎందుకు చర్యలు తీసుకోరాదో చెప్పాలని టీఎన్జీఓ, టీజీఓ, పీఆర్టీయూ ఉద్యోగ సంఘాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వివరణ కోరారు. సాధారణంగానే ముఖ్యమంత్రితో భేటీ అయ్యామని ఉద్యోగ సంఘాలు.. ఎన్నికల కమిషన్కు సమాధానమిచ్చాయి. ఉద్యోగుల సమస్యలపై చర్చించామని.. బడ్జెట్తో పాటు... ఇతర సమస్యలను సీఎంతో చర్చించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు ఎన్నికల కమిషన్కు ఇచ్చిన సమాధానంలో పేర్కొన్నాయి.
ఇవీచూడండి: కౌంటింగ్ కేంద్రాల్లో గొడవలు జరిగే అవకాశం ఉంది: కోదండరాం