ఆంధ్రప్రదేశ్ తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ 18వ స్నాతకోత్సవాన్ని బుధవారం నిర్వహించనున్నట్లు వర్సిటీ వీసీ ఆచార్య జమున ప్రకటించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి ఓల్గా (పోపూరి లలితకుమారి)కి గౌరవ డాక్టరేట్ అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25న వర్సిటీలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.40 వరకు స్నాతకోత్సవం జరుగుతుందని తెలిపారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కులపతి హోదాలో ఆన్‌లైన్ ద్వారా ప్రసంగిస్తారని అన్నారు. ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరుకానున్నారు.
కొవిడ్ నిబంధనల మేరకు 150 మంది విద్యార్థినులనే వేడుకలకు అనుమతించనున్నారు. 135 మందికి పీహెచ్‌డీ డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. 2017-18, 2018-19, 2019-2020 విద్యా సంవత్సరాల్లో ఎంఫిల్, పీజీ, యూజీ కోర్సులు పూర్తి చేసిన 3054 మందికి వర్చువల్‌గా పట్టాలు అందజేస్తారు. 150 మందికి బంగారు పతకాలు, 31 మందికి పుస్తక బహుమతులు ఇవ్వనున్నారు. అమెరికాకు చెందిన మీనాక్షి ఎన్‌ఆర్‌ఐ కోటాలో వర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆమెకు సంబంధిత డిగ్రీ అందజేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: TS schools reopen: 'ఈనెల 30 నాటికి విద్యాసంస్థల పునఃప్రారంభానికి సిద్ధం చేయాలి'