ఆయనో మాజీ ఎంపీ. ఫేస్‌బుక్‌లో చురుగ్గా ఉంటారు. కొందరు సైబర్ నేరగాళ్లు ఆయన ఫేస్‌బుక్ ఖాతాలోని ప్రొఫైల్, ఇతర చిత్రాల్ని సేకరించి.. వాటితో నకిలీ ఖాతాను సృష్టించారు. దాన్నుంచి ఆయన ఖాతాలోని స్నేహితుల జాబితాలో ఉన్నవారందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపించారు. వాటిని ఓకే చేసిన మరుక్షణమే మెసెంజర్‌లో పలకరించారు. అత్యవసరంగా రూ.40 వేలు కావాలని, గూగుల్ పే, ఫోన్ పే ఉంటే వాటిలో పంపిస్తే రేపు తిరిగి చెల్లించేస్తానని కోరారు. మాజీ ఎంపీయే డబ్బులు అడుగుతున్నారని భావించి పలువురు డబ్బులు పంపించి మోసపోయారు.
మన స్నేహితుల పేరుతో డబ్బులు పంపమని కోరే నకిలీ ప్రొఫైల్స్ ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వెల్లువెత్తుతున్నాయి. అచ్చం అసలైన ఖాతాల్ని పోలినట్టు ఉండే వీటి ద్వారా కొన్ని వేల మంది బాధితులవుతున్నారు. అనేక మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. రాజస్థాన్‌లోని భరత్‌పుర, నోయిడా, పశ్చిమబెంగాల్ తదితర ప్రాంతాలకు చెందిన సైబర్ నేరగాళ్లు ఈ దందాకు పాల్పడుతున్నారు. నకిలీ ప్రొఫైల్స్ నుంచి ఒక్కో వ్యక్తిని తక్కువ మొత్తం పంపమని కోరుతున్నారు. అలాంటి అభ్యర్థనలను ఎక్కువ మందికి పంపుతుండటంతో వారు బాగానే డబ్బులు గుంజగలుగుతున్నారు.
తక్కువ మొత్తమే కదా అనుకుంటూ చాలామంది ఫిర్యాదు చేయట్లేదు. ఇదే అదనుగా ఈ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ తరహా మోసాలు నిత్యం జరుగుతున్నా.. వీటి మూలాల్ని ఛేదించటంపై పోలీసులు దృష్టి సారించట్లేదు. ఈ నకిలీ ఖాతాల సృష్టి కొంతమంది వ్యక్తుల పనా? లేదా వ్యవస్థీకృతంగా సాగుతోందా? అనే దిశగా దర్యాప్తు సాగడం లేదు. వీటి మూలాలు ఎక్కడున్నాయి? ఎవరు నడిపిస్తున్నారనే విషయాల్లో లోతుగా దర్యాప్తు సాగకపోవడంతో ఈ దందా నిరాటకంగా సాగిపోతోంది.
ఇలా ఉంటే అనుమానించాల్సిందే
- ఫేస్‌బుక్‌లో మీ స్నేహితుల జాబితాలో అప్పటికే ఉన్న వ్యక్తులు, వారి చిత్రాలతో ఉన్న ప్రొఫైల్‌తో మరోసారి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే నకిలీ ఖాతాయేమోనని అనుమానించాలి. ఆ ప్రొఫైల్‌లోకి వెళ్లి అందులో ఉన్న పోస్టుల్ని పరిశీలిస్తే నాలుగో, అయిదో ఉంటాయి. అవీ ఒకటి, రెండు రోజుల ముందో, కొన్ని గంటల కిందటో పెట్టినవే.
- ఫ్రెండ్ రిక్వెస్ట్ ఓకే చేసిన వెంటనే.. మీ మెసెంజర్‌లోకి వచ్చి హాయ్, హౌ ఆర్ యూ అని పలకరించి గూగుల్ పే, ఫోన్ పే ఉందా? అని అడుగుతున్నారంటే అది కచ్చితంగా సైబర్ నేరగాళ్ల పనే.
- మెసెంజర్‌లో మీరు తెలుగులో సమాధానమిస్తున్నా.. అవతలి వ్యక్తి కేవలం ఇంగ్లీష్‌లోనే స్పందిస్తున్నా, మీరేం అడిగినా సరే డబ్బులు అత్యవసరం, గూగుల్ పే, ఫోన్‌పే ఉంటే పంపించు అనే సమాధానమిస్తుంటే వారు కేటుగాళ్లని అర్థం చేసుకోవచ్చు.
- కొందరు వ్యక్తుల పేరిట ఉన్న అసలైన ఫేస్‌బుక్ ఖాతాలోని పేర్లలో ఒక అక్షరమో లేదా ఇంటి పేరో అటు, ఇటూ మార్చి నకిలీ ఖాతాలు రూపొందిస్తారు. అలాంటి ప్రొఫైల్స్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి.
నకిలీ ఖాతాల్ని రిపోర్టు చేయటం ఎలా?
* మీ పేరిట లేదా, మీకు తెలిసిన వ్యక్తుల పేరిట ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్ తయారు చేసి, దాని ద్వారా డబ్బులు అడుగుతున్నారని గుర్తిస్తే వెంటనే అది నకిలీ ఖాతా అని ఫేస్‌బుక్‌కు రిపోర్టు చేయాలి.
* తొలుత ఆ నకిలీ ఖాతా టైమ్‌లైన్‌లోకి వెళ్లాలి. అందులో పై భాగంలో ఉన్న 3 అడ్డుచుక్కల (త్రీడాట్స్ మెనూ)పై క్లిక్ చేస్తే పలు అంశాలు కనిపిస్తాయి. అందులో ‘ఫైండ్ సపోర్ట్ ఆర్ రిపోర్ట్ ప్రొఫైల్’పై క్లిక్ చేయాలి.
* వెంటనే ‘ప్లీజ్ సెలక్ట్ ఏ ప్రాబ్లమ్ టూ కంటిన్యూ’ అని కనిపిస్తుంది. అందులోని అంశాల ఆధారంగా ‘ప్రిటెండింగ్ టూ బీ సమ్ వన్’ లేదా ‘ఫేక్ అకౌంట్’ విభాగాల్లోకి వెళ్లి రిపోర్టు చేయొచ్చు. వాటి ఆధారంగా ఫేస్‌బుక్ ఆ ఖాతాను పరిశీలించి నకిలీదైతే తొలగిస్తుంది.
* ఇదే అంశంపై పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు.
సెట్టింగ్‌లు మార్చుకోండి..
* ఫేస్‌బుక్ వినియోగదారులు వారి ఖాతాలోని వివరాలు, చిత్రాలు.. స్నేహితులు, కుటుంబసభ్యులకు మాత్రమే కనపడేలా సెట్టింగ్స్ మార్చుకోవాలి.
* ప్రొఫైల్ లాక్ చేసుకోవటం కూడా సురక్షితమైన పద్ధతే.
* తమ పేరిట నకిలీ ఖాతాలు ఉన్నాయా అనేది సెర్చ్‌లోకి వెళ్లి ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. అలాంటివి ఉంటే రిపోర్టు ఆప్షన్ ద్వారా ఫిర్యాదు చేయాలి.
* ఎంత సన్నిహితులైనా సరే ఫేస్‌బుక్ మెసేంజర్ ద్వారా డబ్బులు అడుగుతున్నారంటే అనుమానించాల్సిందే. అసలైన వ్యక్తికి ఫోన్ చేసి వాస్తవమా కాదా నిర్ధారించుకోవాలి.
ఇవీచూడండి: కర్ణాటకలో భారీగా దొంగ నోట్లు స్వాధీనం