CS review on Paddy Procurement Centers: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ప్రతి జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎస్.. జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులందరూ పనుల్లో నిమగ్నమవ్వాలని సూచించారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి... ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లో ప్రత్యేక కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పారు. కొనుగోలు కేంద్రాలను మంత్రులు, ప్రజాప్రతినిధులతో తక్షణమే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రతి కేంద్రానికో అధికారి: ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించాలని.. మంత్రులు, అధికారులతో కొనుగోలు ఏర్పాట్లపై సమీక్షించాలని సీఎస్ సూచించారు. అధికారులు రోజుకు కనీసం నాలుగైదు కేంద్రాలను సందర్శించాలన్న సీఎస్... గత యాసంగి కంటే ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రతి కేంద్రం వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని.. ఒక అధికారిని నియమించి కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. గన్నీ బ్యాగుల సేకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఎస్ సూచించారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే పరిష్కరించాలన్న సీఎస్... సేకరించిన ధాన్యాన్ని రవాణా చేసేందుకు వాహనాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ప్రతి రోజు ధాన్యం సేకరణ వివరాల నివేదికలు సమర్పించాలని తెలిపారు. ధాన్యం క్వింటాకు రూ.1960 కనీస మద్దతు ధర అని సీఎస్ తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చూడాలని సూచించిన సీఎస్.. పోలీసు, రవాణాశాఖ అధికారులతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పండిన యాసంగి వడ్లన్నీ రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రకటించారు. ప్రతి గ్రామంలో బుధవారం నుంచే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల నిర్వహణ, పర్యవేక్షణకు నలుగురు ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి కమిటీ వేస్తున్నామని.. ఇందులో ప్రధానకార్యదర్శి, ఆర్థిక, వ్యవసాయ, సాగునీటిశాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఉచిత విద్యుత్‌కు రూ.12 వేల కోట్లు, రైతుబంధుకు రూ.15 వేల కోట్లు, రైతుబీమాకు రూ.1,600 కోట్లు ఇస్తున్నట్టు తెలిపారు. మంగళవారం ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రకటించారు.
ఇదీ చదవండి: CM KCR: యాసంగి వడ్లన్నీ కొంటాం.. రైతులు భరోసాతో ఉండాలి: కేసీఆర్