Covid Vaccine to Teenagers : సందేహాలు.. సంశయాల మధ్య సరిగ్గా ఏడాది క్రితం కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టి.. వందశాతం మందికి తొలిడోస్ ఇచ్చిన పెద్ద రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది తెలంగాణ. ఇక ఇప్పుడు 15 ఏళ్లు నిండిన వారికి టీకా పంపిణీ షురూ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 15-18 ఏళ్ల మధ్య చిన్నారులకు టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది.
22.78 లక్షల మందికి టీకా..
Covid Vaccine for 15-18 Age Group : ఇప్పటికే కొవిన్ పోర్టల్‌లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 22,78,683 లక్షల మంది పిల్లలు టీకా తీసుకునేందుకు అర్హత కలిగి ఉన్నట్టు గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ.. వారందరికీ కొవాగ్జిన్ అందిస్తోంది.
15-18 ఏళ్ల వారికి వ్యాక్సిన్..
Covid Vaccine for Teenagers : జీహెచ్ఎంసీ సహా 12 కార్పొరేషన్లలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పద్ధతిలో టీకాలు పంపిణీ చేస్తోంది. ఇతర జిల్లాల్లో మాత్రం వాక్ ఇన్ పద్ధతిలో టీకాలు ఇస్తోంది. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు సహా ప్రస్తుతం టీకా అందిస్తున్న కేంద్రాల్లో 15 ఏళ్లు పై బడిన వారికి వ్యాక్సిన్ పంపిణీ జరుగుతోంది. పిల్లలకోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
టీకా వేసుకున్నాక అరగంట ఆగాల్సిందే..
Covid Vaccine for Teenagers in Telangana : 2007వ సంవత్సరం, అంతకంటే ముందు జన్మించిన వారు వ్యాక్సిన్ తీసుకునేందుకు అర్హులని స్పష్టం చేసింది. ఈ వయసు వారికి టీకాలు ఇవ్వటం కాస్త సెన్సిటివ్ విషయంగా పేర్కొన్న సర్కార్.. పిల్లలతో పాటు.. తల్లిదండ్రులు వెంట ఉండాలని కోరింది. 0.5 ఎంఎల్ డోస్ కొవాగ్జిన్ టీకాను పిల్లలకు ఇస్తున్నట్లు తెలిపింది. టీకా తీసుకున్న తర్వాత అరగంట సేపు వ్యాక్సినేషన్ కేంద్రంలో వేచి ఉండాలని సూచించింది. పూర్తి స్థాయిలో వైద్యుల పర్యవేక్షణలోనే టీకా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టత ఇచ్చింది. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ నేటి నుంచి పిల్లలకు టీకా అందుబాటులోకి వచ్చింది.
10 నుంచి వారికి బూస్టర్ డోస్..
Corona Booster Dose in Telangana : తొలిడోస్ వ్యాక్సినేషన్ పూర్తైన 28 రోజుల తర్వాతే పిల్లలకు కూడా రెండో డోస్ ఇవ్వనున్నట్టు సర్కారు పేర్కొంది. ఇక ఈ నెల పదో తేదీ నుంచి హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్, 60 ఏళ్లు పై బడిన వారికి బూస్టర్ డోస్‌ను ప్రారంభించనున్నారు.
- ఇదీ చదవండి : ఒమిక్రాన్ ఎఫెక్ట్- సుప్రీం కోర్టు కీలక నిర్ణయం