దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని బుధవారం ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందిస్తూ ‘దేశంలో మళ్లీ లాక్‌డౌన్ ఉండదు. ప్రస్తుతం అన్‌లాక్ 1.0 నడుస్తోంది. అన్‌లాక్ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై మనమంతా చర్చించుకోవాలి’’ అని స్పష్టం చేశారు.
మా సీఎస్‌ది బిహారే..
దేశంలో మళ్లీ మామూలు జీవితం ప్రారంభమవుతున్నందున ఎవరు ఎక్కడికైనా వెళ్లి పని చేసుకునే అవకాశం కల్పించాలని కేసీఆర్ కోరారు. వివిధ రాష్ట్రాల నుంచి కూలీలు, కార్మికులు, హమాలీలు మళ్లీ పని చేసుకోవడానికి వివిధ రాష్ట్రాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారని, వారికి వెసులుబాట్లు ఉండాలని అన్నారు. బిహార్ నుంచి వచ్చే హమాలీలను అక్కడి ముఖ్యమంత్రి నీతీష్‌కుమార్ వారిస్తున్నట్లు వచ్చిన వార్తలపై కేసీఆర్ చమత్కరిస్తూ ‘‘నీతీశ్ జీ! మేము తెలంగాణలో మీ హమాలీలను బాగా చూసుకుంటాం. మా సీఎస్ కూడా మీ బిహార్ వారే. దయచేసి కూలీలను పంపించండి’’ అని అన్నారు.
విజయం సాధిస్తాం
ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల గురించి సీఎం ప్రధానికి వివరించారు. ‘ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. కరోనా ప్రస్తుతం అదుపులోనే ఉంది. మరణాల రేటు కూడా తక్కువగానే నమోదవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరు వల్ల కరోనా విషయంలో తప్పక విజయం సాధిస్తామనే విశ్వాసం మాకుంది. తెలంగాణలో హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. కొద్దిరోజుల్లోనే వ్యాప్తి అదుపులోకి వస్తుందనే విశ్వాసం ఉంది’ అని కేసీఆర్ చెప్పారు.
దేశ రక్షణలో తెలంగాణ అండ..
దేశ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడవద్దని, దేశమంతా ఒక్కతాటిపై నిలవాలని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానికి స్పష్టం చేశారు. భారత్ - చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణ అంశాన్ని ఆయన ప్రస్తావిస్తూ చైనా కానీ, మరే దేశం కానీ భారత్ సార్వభౌమత్వం విషయంలో వేలు పడితే, తప్పక ప్రతిఘటించాలని, తగిన సమాధానం చెప్పాలని సూచించారు. దేశ రక్షణ విషయంలో ఎవరూ రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, దేశమంతా ఒక్కతాటిపై నిలబడాల్సిన సమయమిది అని సీఎం అభిప్రాయపడ్డారు.