ఏపీలోని తిరుపతి ఉపఎన్నికలో ఓట్లడిగే అర్హత వైకాపాకు లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. డబ్బు తీసుకుని ఓటేస్తే హక్కులు కోల్పోతారని ఓటర్లను హెచ్చరించారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలోని రాపూర్లో తలపెట్టిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వైకాపా ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో వైకాపాను గెలిపిస్తే అక్రమాలకు లైసెన్స్ ఇచ్చినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలందరూ రాజీనామా చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తమ పార్టీలో ఉన్న ముగ్గురు ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని సవాల్ విసిరారు. అప్పుడు దిల్లీ వెళ్లి ప్రత్యేక హోదాపై పోరాటం చేయవచ్చన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ఎక్కడా అభివృద్ధి పనుల్లేవని చంద్రబాబు విమర్శించారు. ఎక్కడ చూసినా గతంలో తెదేపా చేసిన అభివృద్ధే కనిపిస్తోందన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు వైకాపా ప్రభుత్వం స్వస్తి పలికిందని ఆక్షేపించారు. వైకాపా ప్రభుత్వం వచ్చి కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని చంద్రబాబు ఆరోపించారు. తెదేపా, వైకాపా పాలనపై చర్చకు ధైర్యముందా..? అని నిలదీశారు.
ఇదీ చదవండి: నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డికి ఈడీ సమన్లు