అరుదైన శస్త్ర చికిత్సను దిగ్విజయంగా నిర్వహించి.. హైదరాబాద్ సనత్‌నగర్ ఈఎస్ఐ వైద్యులు సత్తా చాటారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 18ఏళ్ల యువతికి బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్‌ను నిర్వహించారు. శస్త్ర చికిత్స అనంతరం యువతి కోలుకోవడంతో బుధవారం ఆమెను డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు ప్రకటించారు.
ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ విభాగం సీనియర్ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో యువతి సోదరి నుంచి బోన్ మ్యారోని సేకరించి యువతికి ట్రాన్స్ఫ్యూజన్ చేశారు. నెల రోజల పాటు యువతికి వైద్యం అందించామని ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉండటం వల్ల డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు ప్రకటించారు. ఈఎస్ఐ లాంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లోను అన్ని రకాల సదుపాయాలతో శస్త్ర చికిత్సలు, ట్రాన్స్ ప్లాంటేషన్లు దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని... అర్హులైన వారు ఆయా సేవలను వినియోగించుకోవాలని కోరారు.
ఈఎస్ఐ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఓ యువతి అరుదైన వ్యాధి అప్లాస్టిక్ అనీమియా (aplastic anemia)తో బాధపడుతుంది. అప్లాస్టిక్ అనీమియా అంటే కణాలు ఉత్పత్తి కావు. దీనితో ఆ యువతికి బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆమెకు బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేశాం. ఆమె వయసు 18 సంవత్సరాలు. నెల క్రితం ఆమెకు ఆపరేషన్ చేశాం. రోజురోజుకు ఆమెలో కణాలు వృద్ధి చెందాయి. దీనితో ఈరోజు ఆమెను డిశ్చార్జ్ చేశాము.
- డాక్టర్ శ్రీనివాస్, హెమటాలజిస్ట్, ఈఎస్ఐ ఆసుపత్రి
బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏంటంటే?
లోపం ఉన్న బోన్ మ్యారో నుంచి కణాల ఉత్పత్తిలో తేడాలు వస్తాయి. బీఎంటీ చేసేటప్పుడు ముందు హై డోస్ కీమోథెరపీ ద్వారా బోన్‌మ్యారోని డ్యామేజి చేస్తారు. తరువాత స్టెమ్ సెల్స్ ఎక్కిస్తారు. ఇవి ఆరోగ్యకరమైన రక్తాన్ని తయారుచేస్తాయి. ఈ రక్తం రెండు మూడు వారాల్లో తయారవుతుంది. ఈ ప్రక్రియ కోసం ఐసీయూలో పెట్టి, మానిటర్ చేయాల్సి ఉంటుంది. రక్తం ఎక్కించినట్టుగానే మూలకణాలను ఇస్తారు. ఆటోలోగస్ బీఎంటీ – పేషెంట్ బోన్ మ్యారోనే వాడుతారు. ఇది మైలోమా, లింఫోమాలకు ఉపయోగకరం. మూలకణాలను సేకరించి వాటిని ఫ్రీజ్ చేస్తారు. తరువాత హై డోస్ కీమోథెరపి ఇచ్చి, అప్పటివరకు ఫ్రీజ్ చేసి వుంచిన మూలకణాలను ఎక్కిస్తారు. అలోలోగస్ బీఎంటీ – డోనర్ నుంచి మూలకణాలను తీసుకుంటారు. ఫుల్ మ్యాచ్ లేదా హాఫ్ మ్యాచ్ లేదా ఇంటర్నేషనల్ డోనర్ నుంచి తీసుకుని ఎక్కిస్తారు. దీనివల్ల సమస్య మళ్లీ రాకుండా ఉంటుంది. అయితే గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇమ్యునో సప్రెసెంట్స్ ఇస్తారు.
ఇదీ చూడండి: Heart Transplantation: నిమ్స్‌కు చేరుకున్న గుండె.. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రారంభం