రైతులకు సంఘీభావంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఉపవాస దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగించనున్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు, రైతులు.. ప్రభుత్వానికి సహకరిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలులో జాప్యం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర పదాధికారులు, కోర్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు ఎవరి ఇంట్లో వారు దీక్ష చేపట్టాలని బండి సంజయ్ కోరారు. భాజపా హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు కూడా తన ఇంట్లో ఉపవాస దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.