భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజాసంగ్రామ యాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న బండి సంజయ్.. వేములవాడ రాజన్న ఆలయ వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడి నుంచి పార్టీ ముఖ్య నేతలతో కలిసి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని... జంటనగరాల్లోని బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్‌చుగ్, లక్ష్మణ్, డీకే అరుణ, అర్వింద్, విజయశాంతి, వివేక్ పాల్గొన్నారు. అక్కడే ఏర్పాటు చేసిన సభాప్రాంగణానికి చేరుకున్న బండి సంజయ్.. సమరశంఖం పూరించారు. సభలో ప్రసంగించిన బండిసంజయ్.. ప్రజా సంగ్రామ యాత్రకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు. కేసీఆర్ అవలంభిస్తున్న వైఖరిపై బండిసంజయ్, కిషన్‌రెడ్డితో పాటు పలువురు నాయకులు తీవ్రంగా మండిపడ్డారు.
అధికారంలోకి తేవటమే లక్ష్యంగా..
పాదయాత్ర వేదికగా ప్రజా సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై సమరశంఖం పూరించడమే లక్ష్యంగా పాదయాత్ర కొనసాగనుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. తెరాస ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నిరంకుశ విధానాలను, కుటుంబ పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే.. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తూ 2023లో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా... ‘ప్రజా సంగ్రామ యాత్ర సాగనుంది.
రోజుకు 15 కిలోమీటర్లు.. 35 రోజులు...
భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి మొదలుపెట్టిన పాదయాత్రను.. తరుణ్‌చుగ్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. పెద్దఎత్తున కార్యకర్తలతో బయలుదేరిన బండిసంజయ్ పాదయాత్ర... తొలిరోజున మదీనా, అఫ్జల్‌గంజ్, బేగం బజార్, ఎంజే మార్కెట్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్ మీదుగా మెహదీపట్నంకు చేరుకోనుంది. మెహదీపట్నంలోని జి.పుల్లారెడ్డి ఫార్మసి కాలేజీలో రాత్రి బస చేయనున్నారు. రోజుకు సగటున 10 నుంచి 15 కిలోమీటర్ల చొప్పున 35 రోజుల పాటు పాదయాత్ర సాగనుంది. రెండో రోజు పాదయాత్ర టోలిచౌకీ, షేక్‌పేట, గోల్కొండ కోట, లంగర్‌హౌజ్, బాపుఘాట్ వరకు సాగుతుంది. రెండోరోజు యాత్రలో భాగంగా గోల్కొండ కోట వద్ద సభ ఉంటుంది. బాపూ ఘాట్‌లో రాత్రి బస చేస్తారు.
షెడ్యూల్ వస్తే రూట్‌మ్యాప్ ఛేంజ్..
రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో దశల వారీగా.. బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. అక్టోబర్ 2న.... హుజూరాబాద్ సభతో తొలివిడత ప్రజా సంగ్రామ యాత్ర ముగుస్తుంది. ఈలోపు హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తే... దాని ప్రకారం మెదక్ నుంచి పాదయాత్ర రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి పాదయాత్ర పరిధిని పెంచుకుంటూ పోవడం లేదా తగ్గించుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. 2023 ఎన్నికల వరకు విడతల వారీగా ప్రజాసంగ్రామ యాత్రను చేపట్టనున్నట్లు భాజపా నేతలు వెల్లడించారు. పాదయాత్రకు సంఘీభావంగా కేంద్రమంత్రులతో పాటు పార్టీ జాతీయ నాయకులు ఆయా సభల్లో హాజరుకానున్నారు.
ఇవీ చూడండి: