Electric Buses in APSRTC: పెరుగుతోన్న డీజిల్ ధరల భారాన్ని తగ్గించుకోవడంపై ఏపీఎస్ ఆర్టీసీ దృష్టి పెట్టింది. సంస్థలో ఎలక్ట్రిక్ బస్సులను క్రమంగా పెంచాలని నిర్ణయించింది. అయితే ఎలక్ట్రిక్ బస్సుల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల... డీజిల్ బస్సులనే ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు సిద్ధమవుతోంది. డీజిల్ బస్సులకు క్రమంగా పక్కనబెట్టి.. ఎలక్ట్రిక్ బస్సులను స్వాగతించేందుకు ఆర్టీసీ ముందడుగు వేస్తోంది. ఇంధన ధరలు రోజు రోజుకూ పెరుగుతున్న దృష్ట్యా నిర్వహణ వ్యయం తగ్గించేందుకు డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
సంస్థలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని గతంలోనే నిర్ణయించిన ఆర్టీసీ.... ఇప్పటికే తిరుమల తిరుపతి మధ్య 150 ఇ-బస్సులను ప్రవేశ పెట్టేందుకు టెండర్లు ఖరారు చేసింది. విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. క్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను పెంచుతూ... డీజిల్ బస్సుల సంఖ్యను తగ్గించాలని భావిస్తోంది. దశల వారీగా 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.
ఆర్టీసీలో ప్రస్తుతం 12 వేల బస్సులుండగా అవన్నీ డీజిల్‌తో నడిచేవే. అన్ని బస్సులను ఒకేసారి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం భారీ వ్యయంతో కూడుకున్నది కావడంతో సంస్థకు సాధ్యపడదని నిర్ణయించారు. వీటిలో ఎక్కువ కిలోమీటర్లు తిరిగిన బస్సులన్నీ తక్కువ మైలేజ్ ఇస్తున్నాయి. దీంతో పాటు మరో పదేళ్ల జీవిత కాలం ఉన్న 2 వేల డీజిల్ బస్సులు ఉన్నాయి. వీటిని దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని ఆర్టీసీ నిర్ణయించింది. పాత డీజిల్ బస్సులను ఇ- బస్సులుగా మార్పు చేసేందుకు సిద్ధమవుతోంది. దీనికోసం రెట్రె ఫిట్ మెంట్ ప్రాజెక్టును చేపట్టనుంది.
"ప్రయోగాత్మకంగా చాలా ప్రాంతాల్లో డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. అన్ని ఆర్టీసీలు ఈ ఆలోచన చేస్తున్నా... విజయం సాధిస్తామా లేదా అన్న అనుమానంతో ముందుకు రావడంలేదు. త్వరలో పైలెట్ ప్రాజెక్టు కింద ఒక 100 బస్సులు డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ విధానంలోకి మారుస్తాం. డీజిల్ ధరలు పెరిగినా... విద్యుత్ ధరలు అంతగా పెరిగే అవకాశం లేదు. పర్యావరణానికి నష్టం కలగకుండా, అన్ని వసతులతో నాణ్యమైన సేవలు అందించేందుకు ఇవి ఉపయోగపడతాయి" -ద్వారకా తిరుమల రావు, ఆర్టీసీ ఎండీ
పైలట్ ప్రాజెక్టుగా ఒక డీజిల్ బస్సును ఇటీవల రెట్రోఫిట్ చేసి ఎలక్ట్రిక్ బస్సుగా ఆర్టీసీ మార్చింది. డీజిల్ ఇంజిన్ ఛాసిస్ ఉన్న బస్సులో బ్యాటరీతో పనిచేసే ఇంజన్‌ను ఏర్పాటు చేశారు. ఛాసిస్‌ను అలాగే ఉంచి ఎలక్ట్రిక్ బస్సుకు అనుగుణంగా రీ బాడీ బిల్డింగ్ చేశారు. దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించిన అనంతరం... పుణెలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్టుకి పంపిస్తారు. ఆ బస్సును అక్కడి నిపుణులు పరిశీలించి అన్నీ ప్రమాణాల మేరకు ఉన్నాయని భావిస్తే ధ్రువపత్రాన్ని జారీ చేస్తారు. అనంతరం మిగిలిన ఆర్టీసీ డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తారు.
పుణెలోని సీఐఆర్టీ నుంచి సర్టిఫికెట్ వచ్చాక మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనుంది. ప్రస్తుతం అమలు చేస్తోన్న ఆర్టీసీ అద్దె బస్సుల తరహాలో ఈ రెట్రో ఫిట్‌మెంట్ ప్రాజెక్టు నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం టెండర్లు పిలిచి బిడ్డర్లను ఎంపిక చేస్తోంది. ఈ దిశగా కసరత్తు చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరమల రావు తెలిపారు. కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ బస్సులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. 12 మీటర్ల బస్సులకు 55 లక్షలకు, 9 మీటర్ల బస్సులకు 45 లక్షల చొప్పున రాయితీ ఇస్తోంది. అయితే డీజిల్ బస్సుల్ని ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చినపుడు ఇదే విధంగా రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆర్టీసీ కోరుతోంది.
ఇదీ చదవండి: 'కరెంట్ భారం పెరిగితే మెట్రో ఛార్జీలు కూడా పెంచక తప్పదు..'