AP PRC PROTEST: పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ‘చలో విజయవాడ’కు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. జిల్లాల నుంచి విజయవాడ బయల్దేరిన ఉద్యోగులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పలుచోట్ల ఉద్యోగ సంఘాల నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. ‘చలో విజయవాడ’కు అనుమతి లేదంటూ పలుచోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఉద్యోగులు వచ్చే వాహనాలను వెనక్కి పంపుతున్నారు. నిరసనలో పాల్గొనేందుకు అనంతపురం, కర్నూలు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కడప, ప్రకాశం జిల్లాల నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో బయలు దేరిన ఉద్యోగులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో వారంతా పోలీసుల వైఖరి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న పలువురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరికొందరు ఉద్యోగులను బస్టాండ్ ఎదురుగా ఉన్న ఫుడ్‌కోర్టులో ఉంచారు. తమ అరెస్ట్‌లపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నుంచి వాహనాల్లో వచ్చిన ఉద్యోగులను ఏలూరు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని పెదవేగిలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు.