ఏపీ పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు విషయంలో ప్రభుత్వం జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్లపై హైకోర్టు స్టేటస్ కో విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు విషయంలో గెజిట్లను సవాల్ చేస్తూ హైకోర్టులో రాజధాని రైతులు రామారావుతో పాటు మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
జులై 31న జారీచేసిన గెజిట్ ప్రకటనలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని, వాటి అమలుపై స్టే విధించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజ్‌భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం, సచివాలయం, వివిధ శాఖాధిపతుల కార్యాలయాలు, పోలీసు శాఖ కార్యాలయాలను అమరావతి నుంచి తరలించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. నిపుణుల కమిటీ, ఉన్నతస్థాయి కమిటీ నివేదికలను చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు.
అమరావతి నుంచి రాజధానిని మార్చేసి... 3 రాజధానులు ఏర్పాటు చేసేందుకు శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టకుండా ప్రభుత్వాన్ని నిలువరించాలన్నారు. సీఆర్డీఏ బృహత్తర ప్రణాళికను అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. దీనిపై పూర్తి వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వ న్యాయవాది 10 రోజుల సమయం కోరారు. తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేస్తూ... అప్పటివరకు యథాస్థితిని కొనసాగించాలని త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.