సునీల్, సలోని జంటగా రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాకు కీరవాణి సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ కథలో నాయిక సలోని తాను వివాహం చేసుకునే వ్యక్తి ఎలా ఉండాలో ఊహించుకుని బొమ్మలు గీస్తుంటుంది. వాటిని చూసిన కుటుంబ సభ్యులు పిచ్చి గీతలు అంటూ ఏడిపిస్తుంటారు.
ఆ బొమ్మల్లో ఏదో విషయం ఉందని కథానాయకుడు చెప్తే ఆ కుటుంబ సభ్యులు ఇంప్రెస్ అయ్యేలా రాయాల్సిన గీతమిది. క్లిష్టమైన సన్నివేశం కావడం వల్ల అత్యధిక సమయం పట్టిందని ఓ సందర్భంలో తెలిపారు అనంత శ్రీరామ్. 43 రోజుల వ్యవధిలో ఆ పాట పూర్తి చేశానని చెప్పుకొచ్చారు. కీరవాణి, గీతా మాధురి ఆలపించిన ఈ పాట ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.