Tiger Estimation : అఖిల భారత పులుల లెక్కింపు సర్వే కీలక దశకు చేరింది. పులుల సంఖ్యను శాస్త్రీయంగా తేల్చేందుకు వెయ్యికిపైగా కెమెరాలను ఉపయోగిస్తున్నారు. అమ్రాబాద్, కవ్వాల్ అభయారణ్యాలతోపాటు ఏటూరునాగారం, పాకాల అటవీ ప్రాంతాలపైనా దృష్టి సారించారు.
Tigers Count in India : దేశవ్యాప్తంగా పులుల గణన (ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్) నాలుగేళ్లకోసారి జరుగుతుంది. 2018లో జరిగిన గణనలో తెలంగాణలో 26 పులులున్నట్లు తేలింది. ఈసారి అక్టోబరులోనే ప్రారంభించారు. మరింత కచ్చితత్వంతో పులులను గణించేలా ఈ దఫా అమ్రాబాద్ టైగర్ రిజర్వులో 300 జతలు, కవ్వాల్, సహా మిగతాచోట్ల 200-250 జతల సెన్సార్లు ఉన్న కెమెరాలను అమరుస్తున్నారు. కెమెరాల ముందు నుంచి పులులు వెళ్లినప్పుడు ఇవి గుర్తించి ఫొటోలు తీస్తాయి. జనవరి నెలాఖరులో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.
ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో..
All India Tiger Estimation : గతంలో సిబ్బంది అడవుల్లో తిరుగుతూ పాదముద్రల ఆధారంగా గుర్తించేవారు. ‘‘ప్రస్తుతం అమర్చిన కెమెరాల్లోని సెన్సార్లు, ప్రత్యేక పరిజ్ఞానంతో 25 రోజులపాటు ఫొటోలు తీస్తాయి. ఒకే పులి చిత్రం వేర్వేరు కెమెరాల్లో పలుమార్లు రికార్డయినప్పటికీ చారలను బట్టి ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సాయంతో శాస్త్రీయంగా గుర్తిస్తాం. ఆయా చిత్రాలను డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి పంపుతాం’ అని రాష్ట్ర అటవీశాఖ అధికారి ఒకరు చెప్పారు. అమ్రాబాద్ అభయారణ్యంలో పిల్లలతో తిరుగుతున్న పులుల చిత్రాలు కెమెరాల్లో 20 దఫాలకు పైగా నమోదయినట్లు ఓ అధికారి తెలిపారు. రెండు పులులకు రెండేసి కూనలున్నట్లు గుర్తించామన్నారు.
ఇదీ చూడండి : Interest on Dalit Bandhu Funds : దళితబంధు అమలయ్యే దాకా వడ్డీ చెల్లింపు