కరోనా బాధితుడు అల్లంపల్లి మధుసూదన్ వ్యవహారం హైకోర్టుకు చేరింది. కరోనాతో గాంధీ ఆస్పత్రిలో చేరిన తన భర్త ఆచూకీ తెలపాలని కోరుతూ హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన మధుసూదన్ భార్య మాధవి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
అసలు ఏం జరిగింది..
కరోనాతో ఏప్రిల్ 30న గాంధీ ఆస్పత్రిలో చేరిన తన భర్తతో మే 1 వరకు ఫోన్లో మాట్లాడానని మాధవి చెబుతున్నారు. అనంతరం ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందన్నారు. తన భర్త ఏమయ్యారో చెప్పాలని కేటీఆర్కు ట్వీట్ చేసినట్లు పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం ప్రభుత్వం.. తన భర్త మరణించినట్లు ప్రకటించిందని మాధవి వెల్లడించారు. ఒకవేళ మరణిస్తే తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని.. జీహెచ్ఎంసీ అధికారులు మరణ ధ్రువీకరణ పత్రం ఎందుకు ఇవ్వడం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాది కె.కరుణ సాగర్ వాదించారు. ప్రొటోకాల్ ప్రకారం అంత్యక్రియలు ఎందుకు నిర్వహించలేదన్నారు. తన భర్త బతికే ఉన్నారని.. వైద్యాధికారులు ఉద్దేశపూర్వకంగా వివరాలు దాచిపెడుతున్నారని మాధవి ఆరోపించారు.
హెబియస్ కార్పస్ పిటిషన్పై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిల ధర్మాసనం.. మధుసూదన్ మరణించారా.. బతికి ఉన్నారా.. రేపటిలోగా తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ మరణించినట్లయితే ఆయన భార్యకు అధికారికంగా ఎందుకు సమాచారం ఇవ్వలేదో తెలపాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఇవీచూడండి: గాంధీ ఆసుపత్రిలో కరోనాతో నిండు గర్భిణి మృతి