Agnipath Effect : సైన్యంలో నియామకానికి ప్రయత్నిస్తున్న తమను దేశద్రోహులుగా, సంఘ విద్రోహశక్తులుగా చూపి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం దారుణమని ఏపీలోని అనంతపురం, నంద్యాల, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాలకు చెందిన పలువురు నిరుద్యోగులు వాపోయారు. చిన్న వయసులోనే తమపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో భవిష్యత్తు అంధకారమవుతుందని ఆందోళన చెందారు.
అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన అల్లర్ల నేపథ్యంలో గుంటూరు అర్బన్ జిల్లా నల్లపాడు పోలీసుస్టేషన్ పరిధిలో ఈ నెల 17న అనంతపురం, నంద్యాల, ప్రకాశం, కర్నూలు జిల్లాలకు చెందిన 31 మంది యువకులను పోలీసులు అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. శనివారం వారిని గుంటూరులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ విషయాన్ని జైలు సూపరింటెండెంట్ ఎస్.రాజారావు ధ్రువీకరించారు.
జైలు వద్దకు చేరుకున్న 31 మంది యువత వారి ఆవేదనను సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. ‘మేమంతా సైన్యంలో చేరేందుకు శిక్షణ తీసుకుంటున్నాం. ఇటీవల ప్రవేశపరీక్ష కూడా రాశాం. పరీక్ష రాసిన వారంతా ఓసారి రావాలని పోలీసులు ఆదేశించారు. దీంతో మేం స్వగ్రామాల నుంచి గుంటూరుకు రైలులో టికెట్లు తీసుకుని వస్తుండగా పోలీసులు అడ్డగించారు. గంటలో పంపించేస్తామని మా సెల్‌ఫోన్లు, టికెట్లు తీసుకుని నల్లపాడు పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ బలవంతంగా మా వివరాలు తీసుకుని.. మీపై కేసు నమోదైందని చెప్పారు. ఏ కేసు అని సీఐను ప్రశ్నిస్తే మాలో కొందర్ని కొట్టారు. మేం చెప్పింది న్యాయమూర్తి ఎదుట చెబితే మీ అందరినీ తొందరగా పంపించేస్తాం అని పోలీసులు అనడంతో అలాగే చేశాం. కానీ మమ్మల్ని జైలుకు పంపారు’ అని వాపోయారు. శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్నామేగాని ఎటువంటి అల్లర్లకు పాల్పడేవాళ్లం కాదన్నారు. యువతపై పెట్టిన తప్పుడు కేసులు వెంటనే ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు.