kadem Project latest news: నిర్మల్ జిల్లాలో ఇటీవల భారీ వరద తాకిడికి దెబ్బతిన్న కడెం ప్రాజెక్టు గేట్లకు మరమ్మత్తులు మొదలుపెట్టారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ మొత్తం ఎనిమిది మంది సభ్యులతో పనులు ప్రారంభించింది. గ్యాస్ వెల్డింగ్‌తో దెబ్బతిన్న వరద గేట్ల రేకులను తొలగిస్తున్నారు. అలాగే నిర్మల్‌కు చెందిన మెకానిక్‌లు చెడిపోయిన గేట్ల మోటర్లను తొలగిస్తున్నారు. ఈ రోజు కూడా హైదరాబాద్ నుంచి పలువురు ఇంజనీర్లు, మెకానిక్‌లు వెళ్లనున్నారు. దీంతో మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే.. రాష్ట్రంలో తొలితరం జలాశయాల్లో ఒకటైన కడెం ప్రాజెక్టు... భారీ గండం నుంచి గట్టెక్కినా మరో తీవ్ర సమస్య తలెత్తింది. గేట్లకు సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది. ఇప్పుడిప్పుడే మూసే పరిస్థితే కనిపించడం లేదు. ఇటీవల ఎడతెరిపి లేని వర్షాలతో కడెం జలాశయానికి 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. బయటకు 3 లక్షల క్యూసెక్కులు వదిలారు. 2 లక్షల క్యూసెక్కుల అదనపు ప్రవాహంతో ముప్పు ఏర్పడింది. 18 గేట్లలో 17 ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 700 అడుగుల కంటే... దాదాపు 14 అడుగుల ఎత్తు నుంచి వరద ప్రవహించి భయభ్రాంతులకు గురిచేసింది. గేట్లలో చెట్లు, కొమ్మలు ఇరుక్కొని ఆనకట్ట సహా పరీవాహక ప్రాంతమంతా గందరగోళంగా మారింది. ప్రాజెక్టులోని 18 గేట్లలో 1, 2 నెంబరు గేట్ల కౌంటర్ వెయిట్ కొట్టుకుపోగా 12వ నెంబరు గేటు తెరుచుకోనేలేదు. నాలుగో నెంబరు గేటు పగుళ్లు తేలింది. జేసీబీలు, క్రేన్‌ల సాయం లేకుండా ఇప్పటికిప్పుడు గేట్లలో చేరిన చెత్తను తొలగించే పరిస్థితి లేదు.
భారీగా చెత్త చేరడంతో... కడెం ప్రాజెక్టు గేట్లు మూసివేసే పరిస్థితి కనిపించ లేదు. మొత్తం 18 గేట్లలో జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసినవి తొమ్మిది గేట్లు కాగా..., ఇండియన్ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసినవి మరో 9 గేట్లు. వరదతో భారీ వృక్షాలు ఆనకట్టపై వచ్చి చేరడంతో వాటిని తొలగించడం కష్టంగా మారింది. మరమ్మతుల అనంతరం మళ్లీ గేట్లు మూసిన తరువాత వర్షాలు కురిస్తేనే... ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది.
ఇవీ చదవండి.. కృష్ణానదికి ఎగువ నుంచి తగ్గిన ప్రవాహాలు