ఇది ఆదిలాబాద్ గ్రామీణ మండలం పరిధిలోకి వచ్చే లోహర కొండ ప్రాంతం. సహజసిద్ధమైన అటవీ సంపద, ఎత్తైన కొండలతో ఆహ్లాదం పంచుతోంది. జాలువారే జలధారలు... అక్కడక్కడ కనిపించే చిన్నచిన్న ఆవాసాలు.. భానుడి కిరణాలతో పసిడివర్ణాన్ని సంతరించుకునే పచ్చని పంట చేలతో ప్రకృతి పరవశించిపోతుంది. ప్రహరిగోడల్ని తలపించేలా గుట్టలు.. వెరసి ఈ ప్రాంతం కశ్మీరాన్ని తలపించే దృశ్యాలతో కనువిందు చేస్తోంది.
ప్రకృతి సోయగం స్వాగతం..
ఆదిలాబాద్ నుంచి అంకోలి, తంతోలి మీదుగా వెళ్తుంటే... వానవట్ గ్రామం వస్తుంది. అక్కడి నుంచి లోహర కొండ ప్రాంతం ప్రారంభమవుతుంది. ప్రకృతి సోయగం స్వాగతం పలుకుతున్నట్లుగా కనువిందు చేస్తుంది. కొండ ప్రాంతమంతా మలుపులు తిరుగుతూ ... సన్నటి బీటీ రహాదారిపై పయనిస్తుంటే... ఇరుపక్కల ప్రకృతి మనసుల్ని ఉత్తేజితులను చేస్తోంది. బస్సులు, లారీల జాడే ఉండదు. చిన్న మ్యాక్స్ వాహనాలు, ద్విచక్రవాహనాలపై.. లేదంటే కాలినడకను ఆశ్రయించాలి. ఇక్కడి ప్రాంత ప్రజలు వ్యవసాయమే ఆధారంగా...కాలం వెళ్లదీస్తున్నారు.
జాలువారే జలధార...
వానవట్ నుంచి లోహర వరకు మధ్యన ఉండే పల్లెలన్నీ ఆదివాసీ గూడాలే. అడవితో మమేకమైన వారి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. మామిడిగుట్ట గ్రామం దాటాక ప్రారంభమయ్యే కొండలు, మూలమలుపుల నుంచి చూస్తే... లోతట్టు ప్రాంతమంతా కనువిందు చేస్తుంది. మొలాల్‌గుట్ట, లోహర కొండలపై నుంచి జాలువారే జలధార... మనసులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఆకురాల్చేవిగా ప్రసిద్ధి పొందిన ఆదిలాబాద్ అడవికి వర్షాకాలం మరింత వన్నెతెస్తోంది. కాలానికి అనుగుణంగా సహజసిద్ధంగా శోభిల్లుతూ జిల్లా ఖ్యాతిని ఇనుమడింప జేస్తోంది.
ఇవీ చూడండి: ఉప్పొంగుతున్న పాతాళగంగ... ఇళ్లల్లోకి ఉబికి వస్తున్న ఊట నీరు