UPI Credit Line Facility : యూపీఐ యూజర్స్ అందరికీ గుడ్ న్యూస్. బ్యాంకులు అన్నీ యూపీఐ వినియోగదారులకు ముందస్తుగా క్రెడిట్ లైన్స్ జారీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుమతి ఇచ్చింది. దీనితో ఇప్పటికే ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి.
డబ్బులు లేకపోయినా పేమెంట్స్!
ఈ లేటెస్ట్ ఫెసిలిటీతో.. యూపీఐ వినియోగదారులకు బ్యాంకుల ద్వారా ముందస్తు క్రెడిట్ లైన్ లభిస్తుంది. అంటే లోన్ అమౌంట్ లభిస్తుంది. దీనిని ఉపయోగించి యూజర్లు తమ పేమెంట్స్ పూర్తి చేయవచ్చు. ఆ తరువాత నిర్దిష్ట సమయంలోపు ఆ క్రెడిట్ రుణాన్ని తిరిగి చెల్లిస్తే సరిపోతుంది.
యూపీఐ నౌ & పే లేటర్ ప్రయోజనాలు
UPI Now And Pay Later Benefits : యూపీఐ వినియోగదారులు ఇప్పటి వరకు.. తమ యూపీఐ సిస్టమ్‌కు తమ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్స్, ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్స్, ప్రీపెయిడ్ వాలెట్స్, క్రెడిట్ కార్డులను లిక్ చేసుకుని.. పేమెంట్స్ చేస్తూ వస్తున్నారు. దీని వల్ల వారి ఖాతాల్లో డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే.. లావాదేవీలు చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన యూపీఐ పే లేటర్ సౌకర్యం వల్ల.. బ్యాంకులు తమ ఖాతాదారులకు ముందస్తుగానే క్రెడిట్ లైన్స్ (రుణం) అందిస్తాయి. అందువల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. యూపీఐ ద్వారా పేమెంట్స్ చేసుకోవడానికి వీలవుతుంది.
ఎవరికి అందుబాటులో ఉంటుంది?
ఆయా బ్యాంకులు తమ పాలసీని అనుసరించి.. ఖాతాదారులకు ముందస్తు క్రెడిట్ లైన్స్‌ను అందిస్తాయి. వాస్తవానికి ఇది ఒక ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం లాంటిది. ఖాతాదారులు ఈ ఫెసిలిటీని.. గూగుల్ పే, పేటీఎం, మొబీక్విక్ లాంటి వివిధ మొబైల్ బ్యాంకింగ్ యూపీఐ అప్లికేషన్ల ద్వారా వినియోగించుకోవచ్చు. బ్యాంకులు తమ ఖాతాదారుల అర్హతలను అనుసరించి ఒక పరిమితి మేరకు ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్‌ను మంజూరు చేస్తాయి. ఖాతాదారులు ఈ క్రెడిట్ అమౌంట్‌ను ఉపయోగించి.. యూపీఐ యాప్‌ల ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు. తరువాత నిర్దిష్ట సమయంలోగా ఆ రుణ మొత్తాన్ని బ్యాంకుకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
వడ్డీ చెల్లించాల్సిందే!
UPI Credit Line Interest Rate : బ్యాంకులు ఇచ్చే ఈ ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ మొత్తానికి.. యూజర్లు కచ్చితంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే కొన్ని బ్యాంకులు క్రెడిట్ ఫ్రీ టైమ్‌ను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోగా రుణాన్ని తీర్చివేస్తే.. ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒక వేళ నిర్దిష్ట సమయంలోగా ఆ రుణాన్ని తీర్చకపోతే.. కచ్చితంగా బ్యాంక్ నిర్దేశించిన వడ్డీని వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇది 'బై నౌ అండ్ పే లేటర్' (BNPL) కాన్సెప్ట్‌తో పనిచేస్తుంది.
రుసుములు, వడ్డీలు చెల్లించాలి!
యూపీఐ ముందస్తు క్రెడిట్ లిమిట్ అందించే బ్యాంకులు.. దాని తగినట్లుగా రుసుములు కూడా వసూలు చేస్తాయి. అయితే ఫీజులు ఆయా బ్యాంకులను అనుసరించి మారుతూ ఉంటాయి. ఉదాహరణకు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. క్రెడిట్ లైన్లో వాడుకున్న నగదుపై వడ్డీ విధిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు నిర్దిష్ట పరిధి దాటిన తరువాత సర్వీస్ ఛార్జ్ విధిస్తుంది.
క్రెడిట్ కార్డులకు.. క్రెడిట్ లైన్స్‌కు మధ్య ఉన్న తేడా ఏమిటి?
UPI Credit Line Vs Credit Card : చూడడానికి యూపీఐ క్రెడిట్ లైన్, క్రెడిట్ కార్డ్స్ ఆన్ యూపీఐ రెండూ ఒక్కలానే కనిపిస్తున్నప్పటికీ.. వాటి మధ్య స్పష్టమైన బేధం ఉంది. క్రెడిట్ కార్డు పొందాలంటే.. దానికి చాలా డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. మీ ఆదాయ మార్గాలను, రుణం తీర్చే సామర్థ్యాన్ని తెలుసుకున్న తరువాతే.. బ్యాంకులు లేదా రుణ సంస్థలు క్రెడిట్ కార్డులను మంజూరు చేస్తాయి. కానీ క్రెడిట్ లైన్స్‌ను కేవలం మీ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్‌ను ఆధారంగా చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల చిన్న చిన్న రుణాలు కావాలని ఆశించే వారికి ఈ క్రెడిట్ లైన్స్ బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు చిన్నచిన్న అవసరాలకు బయటి వ్యక్తుల నుంచి అధిక వడ్డీకి అప్పు చేయాల్సిన పని ఉండదు.
రూపేకార్డులు మాత్రమే!
RuPay Card UPI Credit Line : ప్రస్తుతానికి యూపీఐ ప్లాట్ఫారముల్లో రూపే కార్డులను మాత్రమే ఉపయోగించడానికి వీలవుతోంది. ప్రస్తుతం Buy now, pay later (BNPL) అనేది ఫిన్‌టెక్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కంపెనీల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ యూపీఐ క్రెడిట్ లైన్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత.. బ్యాంకులు కూడా ఈ బీఎన్‌పీఎల్ సౌకర్యం అందించడానికి వీలవుతోంది.