TCS Q3 Results 2024 : దిగ్గజ ఐటీ సంస్థ, దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్- టీసీఎస్ మూడో(Q3) త్రైమాసిక ఫలితాలను గురువారం ప్రకటించింది. అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికానికి గానూ కంపెనీ నికర లాభం 8.2 శాతం వృద్ధితో రూ. 11,058 కోట్లుగా నమోదు అయింది. ఇక ఆదాయం విషయానికి వస్తే 4 శాతం మేర పెరిగి రూ. 60,583 కోట్లుగా ఉంది. ఇంధనం, వనరులు, తయారీ, లైఫ్ సైన్సెస్ & హెల్త్‌కేర్ విభాగాలు టీసీఎస్ వృద్ధికి కారణమయ్యాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆపరేటింగ్ మార్జిన్ అర శాతం పెరిగి 25శాతానికి చేరుకుందని పేర్కొంది. నికర మార్జిన్ 19.4 శాతంగా ఉందని వెల్లడించింది.
గతేడాది త్రైమాసికంతో పోలిస్తే లాభాలు
TCS Quarterly Results : టీసీఎస్ మూడో త్రైమాసిక నికర లాభం కిందటేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 2 శాతం మాత్రమే పెరిగింది. ఇక అంతకుముందు, అంటే జులై- సెప్టెంబర్ త్రైమాసికం(Q2)తో పోలిస్తే లాభం 2.4 శాతం పడిపోయింది. సెప్టెంబర్ క్వార్టర్‌లో నికర లాభం రూ. 11,380 కోట్లుగా నమోదైంది.
భారీగా తగ్గిన ఇన్ఫోసిస్ లాభాలు
Infosys Q3 Results 2024 : భారత రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికానికిగానూ ఫలితాల్ని గురువారం ప్రకటించింది. కంపెనీ నికర లాభం 7 శాతం తగ్గి రూ.6,106 కోట్లకు చేరింది. ఇక్కడ అంచనాల్ని తప్పింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో చూస్తే మాత్రం నికర లాభం రూ. 6586 కోట్లుగా ఉంది. ఇదే సమయంలో ఆపరేషన్స్ రెవెన్యూ మూడో త్రైమాసికంలో 1.3 శాతం పెరిగి రూ. 38,821 కోట్లుగా నమోదైంది.
Infosys Results Q3 2024 : అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే క్వార్టర్‌లో నికర ఆదాయం రూ. 38,570 కోట్లుగా ఉండేది. ఈ ఫలితాల నేపథ్యంలో కంపెనీ రెవెన్యూ గైడెన్స్‌ను 1.5 శాతం నుంచి 2 శాతానికి సవరించింది ఇన్ఫోసిస్.