Rakesh Jhunjhunwala Buys NCC: మౌలిక సదుపాయాల రంగ సంస్థ ఎన్‌సీసీ లిమిటెడ్‌లో బిగ్‌బుల్‌గా ప్రాచుర్యం కలిగిన అగ్రశ్రేణి స్టాక్‌మార్కెట్ మదుపరి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా, ఆయన భార్య రేఖ ఝున్‌ఝున్‌వాలా తాజాగా పెద్దమొత్తంలో షేర్లు కొనుగోలు చేసి తమ వాటా పెంచుకున్నారు. ఈ ఏడాది జనవరి- మార్చిలో వీరు ఈ సంస్థలో అదనంగా 44 లక్షల షేర్లు కొనుగోలు చేశారు. దీంతో ఈ కంపెనీలో రాకేశ్, ఆయన భార్యకు కలిపి 2021 డిసెంబరు ఆఖరుకు ఉన్న 12.84 శాతం వాటా, తాజాగా 13.56 శాతానికి పెరిగింది. కరోనా మహమ్మారి తర్వాత దేశంలో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కావడం, మౌలిక సదుపాయాల రంగంలోని సంస్థలకు భారీగా ప్రాజెక్టులు లభించే అవకాశం ఉండటంతో ఈ రంగానికి చెందిన కంపెనీలపై స్టాక్‌మార్కెట్లో మదుపరులు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కోవలోనే రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఎన్‌సీసీ లిమిటెడ్‌లో వాటా పెంచుకున్నారనే వాదన వినవస్తోంది.
ఇద్దరికీ కలిపి 13.56 శాతం వాటా: ఎన్‌సీసీలో ఎన్నో ఏళ్లుగా రాకేశ్ ఝున్ ఝున్‌వాలా వాటాదారుడిగా ఉన్నారు. గతేడాది డిసెంబరు నెలాఖరుకు ఈ కంపెనీలో ఆయన పేరు మీద 6,67,33,266 షేర్లు (10.94%), ఆయన భార్య రేఖ ఝున్‌ఝున్‌వాలాకు 1.16 కోట్ల షేర్లు (1.90%) ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా షేర్లు అంతే ఉండగా, ఆయన భార్య పేరు మీద కొత్తగా 44 లక్షల షేర్లు కొనుగోలు చేశారు. దీంతో ఆమె పేరు మీద ప్రస్తుతం 1.60 కోట్ల షేర్లు (2.62% వాటాకు సమానం) ఉన్నాయి. ఇద్దరికీ కలిపి ఎన్‌సీసీలో తాజాగా 13.56% వాటా ఉన్నట్లు అవుతోంది.
ధర తగ్గినప్పుడు కొనుగోలు చేస్తూ: ఎన్‌సీసీలో ఇంకా పలు మ్యూచువల్ ఫండ్లు, కొన్ని దేశీయ, విదేశీ సంస్థలు వాటాదార్లుగా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ సంస్థల్లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్, ఆదిత్యా బిర్లా సన్‌లైఫ్ ఇన్‌ఫ్రా ఫండ్, నిప్పన్ లైఫ్ పవర్ అండ్ ఇన్‌ఫ్రా ఫండ్, ఐడీఎఫ్‌సీ స్టెర్లింగ్ వాల్యూ ఫండ్ ఉన్నాయి. విదేశీ సంస్థ వాన్‌గార్డ్ ఎమెర్జింగ్ మార్కెట్స్ ఫండ్, దేశీయ బీమా రంగ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెప్పుకోదగ్గ వాటాలున్నాయి. ఎన్‌సీసీ షేరు 52 వారాల గరిష్ఠ ధర రూ.98.45 కాగా, కనిష్ఠ ధర రూ.55.80. గత బుధవారం బీఎస్‌ఈలో షేరు ధర రూ.70 వద్ద ముగిసింది. ఈ ఏడాది జనవరి- మార్చిలో స్టాక్‌మార్కెట్లో వచ్చిన దిద్దుబాటు వల్ల ఈ షేరు ధర తగ్గింది. దీన్ని మదుపరులు అవకాశంగా తీసుకుని, కొత్తగా షేర్లు జతచేసుకుని తమ వాటా పెంచుకున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ట్విట్టర్‌పై మస్క్‌కు ఎందుకంత మక్కువ? ప్లాన్-బి ఏంటి?