వంట నూనెల దిగుమతి సుంకంపై కల్పిస్తున్న రాయితీలను 2023 మార్చి వరకు కొనసాగుతాయని కేంద్ర ఆహార శాఖ ప్రకటించింది. దేశీయంగా సరఫరాను పెంచి ధరల్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతోనే ఉపశమనాలను మరో ఆరు నెలలు పొడిగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. అంతర్జాతీయంగా ధరలు దిగొస్తున్నాయని.. ఫలితంగా దేశీయంగానూ ధరలు అదుపులోకి వస్తున్నాయని పేర్కొంది. దీనికి సుంకాల రాయితీ కూడా జతకావడం వల్ల భారత్‌లో ధరలు గణనీయంగా తగ్గాయని తెలిపింది. తాజా నిర్ణయంతో ముడి, రిఫైన్డ్ పామాయిల్, ముడి, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, ముడి, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ నూనెలపై ప్రస్తుతం ఉన్న దిగుమతి సుంకాలు యథాతథంగా కొనసాగనున్నాయి.
ప్రస్తుతం ముడి రకాల నూనెలపై సున్నా శాతం దిగుమతి సుంకం ఉంది. అయితే, వ్యవసాయం, సామాజిక సంక్షేమ సెస్సులతో కలిపి మొత్తంగా వీటి దిగుమతిదారులు 5.5 శాతం పన్ను కట్టాల్సి వస్తోంది. అలాగే రిఫైన్డ్ పామాయిల్ దిగుమతిపై 13.75 శాతం, రిఫైన్డ్ సోయాబీన్, సన్‌ఫ్లవర్ నూనెలపై 19.25 శాతం పన్ను విధిస్తున్నారు. గత ఏడాది అంతర్జాతీయ మార్కెట్‌లో వంటనూనెల ధరలు భారీగా పెరిగాయి. భారత్ తన అవసరాల్లో 60 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. దీంతో దేశీయంగానూ ధరలు కొండెక్కాయి.
ఇవీ చదవండి: రూ.500తోనే బంగారం, వెండిలో మదుపు.. ఇవి తెలుసుకోండి!
మళ్లీ రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. రూ.1.47 లక్షల కోట్లు రాబడి