స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 424 పాయింట్ల లాభంతో 48,677 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 121 పాయింట్లు బలపడి 14,617 వద్ద ముగిసింది. ఫార్మా, ఆర్థిక షేర్లు రాణించాయి. వీటికి తోడు ఐటీ షేర్లు దన్నుగా నిలవడం కారణంగా మార్కెట్లు లాభాల బాట పట్టాయి.
దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రరూపం దాల్చుతున్న వేళ.. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చేసిన ప్రకటనతో మదుపరులు కొనుగోళ్లకు ఉపక్రమించారు. ఈ క్రమంలో బ్యాంక్ షేర్లు పుంజుకున్నాయి.
ఇంట్రాడే సాగిందిలా
సెన్సెక్స్ 49,742 పాయింట్ల అత్యధిక స్థాయి: 48,254 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.
నిఫ్టీ 14,637 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,506 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ ఇండ్, కోటక్ మహీంద్ర బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్, టీసీఎస్, ఎస్బీఐ షేర్లు లాభాలతో ముగిశాయి.
బజాజ్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలివర్, టెక్ మహీంద్ర షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.