స్టాక్‌మార్కెట్లను నష్టాలు వీడట్లేదు. సూచీలు తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. ఫలితంగా.. ఆరంభ ట్రేడింగ్ లాభాలు ఆవిరయ్యాయి. స్వల్ప లాభాల అనంతరం నష్టాల్లోకి వెళ్లాయి. సానుకూల సంకేతాలతో లాభాలతో ప్రారంభమైన సూచీలు.. ఒక్కసారిగా ఒత్తిడికి లోనై నష్టాల బాట పట్టాయి.
అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్) వచ్చే రెండేళ్లలో భారత వృద్ధిరేటు అంచనాలను తగ్గించింది. 2019, 20 ఆర్థిక సంవత్సరాల్లో ముందు ప్రకటించిన వృద్ధిరేటు కన్నా 0.3 శాతం తక్కువగా నమోదు కానుందని పేర్కొంది. ఇది మదుపరుల మనోభావాలపై ప్రభావం చూపించింది. విదేశీ నిధులు భారీగా తరలి వెళ్లటం నష్టాలకు దారితీసింది. ఆటో, లోహ, విద్యుత్తు, ఫార్మా, ఐటీ, ఇన్ఫ్రా రంగాలన్నీ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి. కొనుగోళ్లు మందగించాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 113 పాయింట్లు క్షీణించింది. చివరి సెషన్లోనే 38 వేల మార్కును కోల్పోయిన సెన్సెక్స్.. నేడు మరింత పతనమైంది. ఒకానొక దశలో 38 వేల పాయింట్లను అధిగమించిన సూచీ.. ప్రస్తుతం 37 వేల 869 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 11 వేల 300 మార్కు కోల్పోయింది. ప్రస్తుతం 52 పాయింట్లు కోల్పోయి 11 వేల 279 వద్ద ఉంది.
లాభనష్టాల్లోనివి...
హెచ్డీఎఫ్సీ, యస్ బ్యాంక్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టోరెంట్ ఫార్మా, జీ ఎంటర్టైన్మెంట్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టీ, హెచ్‌యూఎల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, టాటా స్టీల్ లాభాలు నమోదు చేశాయి.
వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ సుజుకీ, సిప్లా, బీపీసీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, ఎం అండ్ ఎం నష్టాల బాట పట్టాయి.
రూపాయి మారకం..
రూపాయి ఆరంభ ట్రేడింగ్‌లో స్వల్పంగా 15 పైసలు క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే మారకం విలువ ప్రస్తుతం 68.94 వద్ద ఉంది.