ఖచ్చితమైన రాబడిని ఇచ్చే పెట్టుబడి సాధనం ఫిక్స్డ్ డిపాజిట్(ఎఫ్‌డీ). ఇందులో మదుపు చేసేందుకు కీలకమై అంశం వడ్డీ రేటు అనడంలో సందేహం లేదు. సాధారణంగా కో-ఆపరేటీవ్, స్మాల్ ఫినాన్స్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి. వాణిజ్య బ్యాంకులు వీటితో పోల్చితే కొంత తక్కువ వడ్డీ రేటును ఇస్తాయి. అయితే ఎఫ్‌డీ విషయంలో వడ్డీ రేటు కీలమైనప్పటికీ ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు వ్యక్తిగత ఆర్థిక నిపుణులు.
భద్రత
ఫిక్స్డ్ డిపాజిట్‌ను సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు డిపాజిట్‌కు బీమా ఉంటుంది. వడ్డీ, అసలుకు కలిపి ఈ బీమాను రూ.5 లక్షలుగా నిర్ణయించింది ప్రభుత్వం. కొన్ని చిన్న తరహా బ్యాంకుల బీమా ప్రీమియంలు చెల్లించకపోవచ్చు. అందుకే డిపాజిట్ చేసే ముందే ఆ బ్యాంక్‌కు బీమా ఉందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులు, పెద్ద ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లకు భద్రత ఎక్కువగా ఉంటుంది. షెడ్యూల్డ్ బ్యాంకులకూ ఈ బీమా వర్తిస్తుంది.
విశ్వసనీయత
ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైనవని అనుకున్నప్పటికీ.. 100 శాతం రిస్కు లేదని కాదు. ఎన్బీఎఫ్సీ, కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో ఇటీవల చూసిన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. వాణిజ్య బ్యాంకుల్లో ఎఫ్‌డీ తీసుకోవటం వల్ల బీమా ఉంటుంది. కో-ఆపరేటివ్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. ఎన్బీఎఫ్సీల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే.. ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి, క్రెడిట్ రేటింగ్ లాంటి విషయాల గురించి తెలుసుకోవాలి.
పన్ను
ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ముందు పన్ను వివరాలను తప్పకుండా తెలుసుకోవాలి. పన్ను ప్రయోజనాలు కల్పించే 5 సంవత్సరాల ఎఫ్డీని తీసుకోవటం గురించి ఆలోచించాలి. ఫిక్స్డ్ డిపాజిట్‌పై వచ్చే వడ్డీపై ఆదాయ పన్ను చట్టం ప్రకారం శ్లాబుకు అనుగుణంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వార్షికంగా వడ్డీ ఆదాయం రూ.40వేల కంటే ఎక్కువ ఉంటే.. టీడీఎస్ ద్వారా పన్ను ఆటోమేటిక్‌గా డిడక్ట్ అవుతుంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే ఈ పరిమితి రూ. 50వేలు. పన్ను శ్లాబులో లేనట్లయితే 15జీ, 15హెచ్ సమర్పించటం ద్వారా టీడీఎస్ నుంచి మినహాయింపు పొందొచ్చు.
ముందస్తు ఉపసంహరణ
కొన్ని బ్యాంకులు ఎఫ్‌డీ ముందస్తు ఉపసంహరణకు భారీగా ఛార్జీలు వసూలు చేస్తాయి. అందుకే ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఎఫ్డీలో మదుపు చేయాలని సలహా ఇస్తున్నారు నిపుణులు.
ఇదీ చదవండి: సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌లు ఇవే..