కుటుంబ సభ్యుడి ఆకస్మిక మరణాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. ఇతర సభ్యులు మానసికంగా కుంగిపోతారు. అదే వ్యక్తి కుటుంబానికి ఆధారమైతే ఆర్థికంగానూ ఇబ్బందులు తప్పవు. సంపాదించే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో పొదుపు, పెట్టుబడులు వంటి విషయాల గురించి సమాచారం ఇవ్వకపోతే మరిన్ని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఏదేమైనా కుటుంబంలో సంపాదించే వ్యక్తి తన పొదుపు, పెట్టుబడులు ఇతర ఆర్థిక అంశాల గురించి ప్రాథమిక సమాచారాన్ని కుటుంబ సభ్యులకు ఇవ్వడం మంచిదని చెబుతారు ఆర్థిక నిపుణులు.
ఉదాహరణకు బ్యాంకు ఖాతా విషయాన్నే తీసుకుందాం. మరణించిన వ్యక్తికి బ్యాంక్ ఖాతా ఉండి.. ఏటీఎం పిన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ వివరాలు ఇతర కుటుంబ సభ్యులకు తెలిసి ఉంటే.. ఆ ఖాతాలోని నగదు తీసుకోవడం కాస్త సులభమవుతుంది. ఒకవేళ అలాంటి వివరాలు తెలియకపోయినా బ్యాంకును సంప్రదించి.. చట్టపరంగా ఖాతాలో ఉన్న సొమ్మును విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియకు కాస్త ఎక్కువ సమయం పట్టొచ్చు.
చట్టపరంగా మరణించిన వ్యక్తి ఖాతాలోని డబ్బును క్లెయిమ్ చేసుకోవడం ఎలా? ఆ ఖాతాపై ఎవరికి హక్కులు ఉంటాయి అనే వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
నామినీని ఏర్పాటు చేసి ఉంటే..
ఒకవేళ ఖాతాదారుడు, నామినీని ఏర్పాటు చేసి ఉంటే... ఖాతాలో ఉన్న మొత్తాన్ని ఆ బ్యాంక్ నామినీకి చెల్లిస్తుంది. డిపాజిట్ చేసిన వ్యక్తి మరణిస్తే, నామినీ ఆ ఖాతాకు ధర్మకర్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఖాతాకు సంబంధించి ఖాతాదారుడు మరణించిన తరువాత ఆ ఖాతాలోని డబ్బును నామినీ తీసుకోవచ్చు. నామినీ ఏర్పాటు చేయకపోతే, చట్టబద్ధమైన వారసులుకు ఆ డబ్బులు దక్కుతాయి. అయితే ఇందుకు నామినీ గానీ.. చట్టపరమైన వారసులు గానీ సరైన ఆధారాలు చూపించడం తప్పనిసరి.
వ్యక్తిగత ఖాతా విషయంలో..
వ్యక్తిగత ఖాతా విషయంలో మరణించిన వ్యక్తి విల్లు రాసి ఉంటే.. దాని ప్రకారం హక్కుదారులు ఆస్తిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే ఇండెమ్నిటి-కమ్-అఫిడెవిట్ బేసిస్‌పై చట్టపరమైన వారసులకు డబ్బును అప్పగిస్తుంది బ్యాంక్.
క్లెయిమ్ చేసే వారిపై ఎలాంటి సందేహాలు, గొడవలు, సమస్యలు లేకపోతే, చట్టబద్ధమైన వారసులందరూ కలిసి ఉమ్మడిగా ఇండెమ్నిటి సమర్పించి క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఆ వ్యక్తికి పూర్తి ఆధారాలు..
ఖాతాదారుల్లో ఒకరు మరణించినా.. మరొ సభ్యుడు ఖాతాలోని డబ్బును తీసుకోవచ్చు. ఖాతాను నిర్వహించేదుకు రెండో వ్యక్తికి పూర్తి అధికారాలు ఉంటాయి.
ఇలాంటి సమస్య రాకుండా, తాము లేనప్పుడు కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా వ్యక్తిగత ఖాతాను తెరిచి నామినీని తప్పనిసరిగా నియమించాలని సూచిస్తున్నారు నిపుణులు. అలా కాకుండా.. మరణం తరువాత పూర్తిస్థాయి యజమాని కావాలనుకునేవారు ఆ వ్యక్తితో కలిసి జాయింట్ ఖాతాను తెరవొచ్చని చెబుతున్నారు.
ప్రాసెస్..
ఖాతాదారుని మరణానంతరం ఖాతాలోని మొత్తాన్ని తీసుకునేందుకు ఒక ప్రక్రియ ఉంటుంది. ముందుగా మరణించిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్ (మరణ ధ్రువీకరణ పత్రం)ను తీసుకోవాలి. దీని జిరాక్స్ కాపీతోపాటు మరణించిన వ్యక్తి గుర్తింపు కార్డ్‌ను జత చేసి.. లిఖిత పూర్వకంగా సంబంధిత బ్యాంక్‌కు దరఖాస్తు చేసుకోవాలి.
నామినీ ఐడీ అడ్రస్ ప్రూఫ్ వంటివి బ్యాంకుకు ఇవ్వాలి. నామినీ ట్రస్టీగా మాత్రమే వ్యహరించాలి. ఖాతాదారుడు విల్లు రాసి ఉంటే దాని ప్రకారం హక్కుదారులకు ఆ మొత్తాన్ని అందించాలి. నామినీ కూడా చట్టబద్ధమైన వారసుడైతే, విల్లులో ప్రస్తావించిన విధంగా ఇతర చట్టబద్ధమైన వారసులతో పాటు నామినీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. విల్లు లేకపోయినా ఆ మొత్తాన్ని చట్టబద్ధమైన హక్కుదారులకు అందజేయాలని చట్టాలు చెబుతున్నాయి.
ఇవీ చదవండి: