దేశంలో కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో జీవితాలు, జీవనోపాధిని కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రాలతో కలిసి సంయుక్తంగా పని చేస్తున్నట్లు వెల్లడించారు.
దేశీయ కార్పొరేట్ల సమస్యలకు సంబంధించి ఇప్పటికే వివిధ పరిశ్రమ సంఘాల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నట్లు తెలిపారు సీతారామన్. కరోనా రెండో దశను ఎదుర్కొనేందుకు వివిధ వ్యాపారాల నుంచి సూచనలు కోరినట్లు చెప్పారు.
నిర్మలా సీతారామన్‌తో చర్చల్లో పాల్గొన్న వారిలో.. సీఐఐ అధ్యక్షుడు ఉదయ్ కోటక్, ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ్ శంకర్, అసోచామ్ అధ్యక్షుడు వినిత్ అగర్వాల్ ఉన్నారు.
టాటా స్టీల్ ఎండీ టి.వి.నరేంద్రన్, ఎల్&టీ ఛైర్మన్ ఏ.ఎం.నాయక్, టీసీఎస్ ఎండీ రాజేశ్ గోపీనాథ్, మారుతీ సుజుకీ ఛైర్మన్ ఆర్.సి.భార్గవ, టీవీఎస్ గ్రూప్ ఛైర్మన్ వెను శ్రీనివాసన్, హీరో మోటోకార్ప్ ఎండీ పవన్ ముంజల్ వంటి దిగ్గజ కార్పొరేట్లతో కూడా సీతారామన్ వివిధ అంశాలపై చర్చలు జరిపారు.
మరోసారి దేశంలో లాక్డౌన్ పెట్టే యోచన లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇదివరకే స్పష్టం చేశారు. నియంత్రణ చర్యలు మాత్రమే ఉంటాయని తెలిపారు.