కరోనా సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్నా.. ఆ ప్రక్రియలో దేశాల మధ్య వ్యత్యాసం కనబడుతోంది. మహమ్మారి ముందునాటి పరిస్థితికి చేరడానికి పలు దేశాలు తీవ్ర అవరోధాలు ఎదుర్కొంటున్నాయి. ఈ అడ్డంకుల్లో.. లాక్డౌన్లు, పేద దేశాల్లో టీకాల కొరత, కొత్త వైరస్ వేరియంట్ల సమస్య ప్రధానంగా ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ పారిస్‌లోని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ- ఓఈసీడీ సోమవారం ప్రచురించిన నివేదికలో పేర్కొంది.
వృద్ధిలో ఇవే కీలకం..
అభివృద్ధి చెందిన దేశాల్లో.. ఉపశమన, ఉద్దీపన చర్యలు మహమ్మారి సృష్టించిన మాంద్యం నుంచి బయటపడి, వృద్ధి బాటపట్టిస్తున్నాయని ఓఈసీడీ తెలిపింది. గతేడాది డిసెంబర్లో ప్రపంచ ఉత్పత్తి 4.8 శాతంగా ఉంటుందని ఓఈసీడీ అంచనా వేయగా.. తాజాగా అది 5.8 శాతానికి పెరుగుతుందని భావిస్తోంది.
"చాలా దేశాలు 2022 ముగిసే నాటికి మహమ్మారి ముందునాటి ఉత్పత్తి స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నా.. చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. మహమ్మారి లేకపోతే సాధించే వృద్ధి స్థాయికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంకా చేరుకోలేదు. 2022 చివరి నాటికి కూడా చాలా దేశాలు కరోనా ముందునాటి జీవన ప్రమాణాలను అందుకోలేకపోవచ్చు."
-ఓఈసీడీ నివేదిక
అమెరికాలో వృద్ధి 6.5శాతంగా ఉంటుందని గతంలో అంచనా వేయగా.. దానిని 6.9 శాతానికి సవరించింది. నిరుద్యోగ భృతి, స్థానిక ప్రభుత్వ సంస్థలు, అల్పాదాయ వర్గాలపై ఆ దేశం ఖర్చులను పెంచడమే అందుకు కారణమని వివరించింది.
పేద దేశాల ప్రతికూలతలు..
ఆర్థిక వ్యవస్థ పుంజుకోకపోవడానికి పేద దేశాల్లో వ్యాక్సిన్ల కొరత, ఉపశమన చర్యలకు అతి తక్కువ వనరులు కలిగి ఉండటమే కారణమని ఓఈసీడీ వివరించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అవి మరింత పేదరికం, ఆర్థిక సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం ఉందని చెప్పింది. ప్రపంచంలోని మెజారిటీ ప్రజలు టీకా వేయించుకోకపోతే.. అందరికీ కొత్త వేరియంట్ల ముప్పు పొంచి ఉన్నట్లేనని పేర్కొంది.
ఇదీ చూడండి: ఆర్థిక వ్యవస్థ వృద్ధికి.. భారీ ఉద్దీపన ప్యాకేజీ?