ఒకప్పుడు పర్సు తెరిస్తే డబ్బులు కనిపించేవి. ఇప్పుడు ఆ స్థానంలో కార్డులు వచ్చి చేరాయి. చూడ్డానికి కార్డులన్నీ ఒకే తీరుగా ఉన్నా.. వాడకం, చెల్లింపుల ఆధారంగా వాటిని వివిధ రకాలుగా వర్గీకరించారు. ప్రస్తుతం దేశంలో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులు, ఎలక్ట్రానిక్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. వీటిలో కొన్ని నేరుగా పొదుపు బ్యాంక్ ఖాతాతో అనుసంధానించి ఉండగా.. మరికొన్ని మీ క్రెడిట్ స్కోర్ విషయంలో సహాయపడతాయి. ఈ కార్డులు వినియోగం, వాటి ఉపయోగాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
డెబిట్ కార్డులు
మీకు బ్యాంక్‌లో సేవింగ్స్ ఖాతా ఉంటే దానికి అనుసంధానించిన డెబిట్ కార్డును బ్యాంక్ జారీ చేస్తుంది. వీసా, రూపే, మాస్టర్ నెట్‌వర్క్ (మాస్టర్ కార్డ్ నుంచి కొత్త కార్డుల జారీపై ఆర్బీఐ ఇటీవల నిషేధం విధించింది.) కార్డులను బ్యాంకులు ఎక్కువగా జారీ చేస్తున్నాయి.
ఈ క్రెడిట్ నెట్‌వర్క్‌లను కార్డులపై ముద్రించడం ద్వారా డెబిట్ కార్డులను ఇతర దేశాలు, ప్రదేశాల్లోనూ చెల్లింపుల కోసం వినియోగించొచ్చు. డెబిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, డెబిట్ కార్డు లావాదేవీలతో మీ క్రెడిట్ స్కోర్‌కు సంబంధం ఉండదు.
క్రెడిట్ కార్డులు
బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ సంస్థలు, మరికొన్ని ఫిన్ టెక్ సంస్థలు క్రెడిట్ కార్డులను జారీ చేస్తాయి. వీటిని ఉపయోగించి పీఓఎస్ టెర్మినల్స్, ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో వస్తువులు, సేవలు కొనుగోలు చేయొచ్చు. బిల్లులు సకాలంలో చెల్లిస్తే మంచి క్రెడిట్ స్కోర్ కూడా సాధించొచ్చు. మీరు ఈ కార్డులను దేశీయంగా, అంతర్జాతీయంగా ఉపయోగించొచ్చు. క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఏటీఎం నుంచి నగదు కూడా విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, ఛార్జీలు పడతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కొన్ని పరిమితులు, షరతులకు లోబడి మీ బ్యాంక్ ఖాతాలు, డెబిట్ కార్డులు, ఇతర క్రెడిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డులకు కూడా నగదు ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.
ప్రీపెయిడ్ కార్డులు
కార్డ్ హోల్డర్ ముందుగానే కొంత డబ్బు చెల్లిస్తే ప్రీపెయిడ్ కార్డులను బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ సంస్థలు అందిస్తాయి. వీటిని కార్డులు లేదా వాలెట్ల రూపంలో జారీ చేయొచ్చు. వీటి ద్వారా ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా చేసుకోవచ్చు. పీఓఎస్ టెర్మినల్స్/ ఈ-కామర్స్ సైట్లలో వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి ఉపయోగించొచ్చు. నిర్దేశించిన పరిమితులు, షరతులకు లోబడి దేశీయంగా నగదు బదిలీ కూడా చేసుకోవచ్చు.
ఎలక్ట్రానిక్ కార్డులు
దేశీయంగా డిజిటల్ లావాదేవీలను చేయడానికి ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలు ఉన్నవారికి ఎలక్ట్రానిక్ కార్డులను బ్యాంకులు జారీ చేస్తుంటాయి. సెక్యూరిటీ, మర్చంట్ డిస్కౌంట్ రేట్ వంటివన్నీ డెబిట్ కార్డుల మాదిరిగానే ఈ ఎలక్ట్రానిక్ కార్డులకు కూడా వర్తిస్తాయి.
ఇదీ చదవండి: సోషల్ మీడియా సెలబ్రిటీల సంపాదన ఎంతో తెలుసా?