కరోనా మహమ్మారి వల్ల ప్రజల్లో కరెన్సీని వినియోగించే తీరులో మార్పులు వచ్చాయంటున్నారు విశ్లేషకులు. ఈ సమయంలోనూ ఏటీఎంల నుంచి భారీగా నగదు విత్డ్రా చేస్తున్నప్పటికీ.. డిజిటల్ చెల్లింపులకే అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు చెబుతున్నారు.
నగదు విత్డ్రా ఎందుకు?
కరోనా రెండో దశ వల్ల నిత్యం బయటకు వెళ్లేందుకు భయపడుతున్న ప్రజలు ఓకే సారి పెద్ద మొత్తంలో నగదు విత్డ్రా చేసి పెట్టుకుంటున్నట్లు విశ్లేషకులు వివరించారు. దానిని అత్యవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే చిన్న మొత్తాల్లో, రోజువారీ కొనుగోళ్లకు మాత్రం యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.
గతంలో ఏటీఎం నుంచి సగటున రూ.2-3 వేల వరకు నగదు విత్డ్రా చేసే వారు ఇపుడు రూ.3-4 వేల వరకు విత్డ్రా చేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. రూ.వెయ్యి వరకు లావాదేవీలను డిజిటల్ వాలెట్ల ద్వారా జరుపుతున్నట్లు వెల్లడైంది.
ఐఎంపీఎస్ ద్వారా ప్రస్తుతం రోజుకు సగటు లావాదేవీ విలువ రూ.9 వేలుగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. గతంలో ఇది రూ.6-7 వేల మధ్య ఉన్నట్లు తెలిపింది.
ఆర్బీఐ డేటా ప్రకారం.. మే 7 నాటికి రూ.2,939,997 కోట్ల నగదు చలామణిలో ఉంది. మార్చి 26న ఇది 2,858,640 కోట్లుగా ఉండటం గమనార్హం.
ఇదీ చదవండి:ఎయిర్టెల్ కొత్త ఆఫర్- రూ.49 రీఛార్జ్ ఫ్రీ!