ఆర్థికమాంద్యం పరిస్థితులను అధిగమించేందుకు ఇప్పటికే పలు రంగాలకు ఉద్ధీపనలు ప్రకటించింది కేంద్రం. తాజాగా వివిధ రంగాలకు సంబంధించి జీఎస్టీ రేట్లను తగ్గించింది. సేవా రంగానికి ఊతమిచ్చే లక్ష్యంతో హోటల్ గదుల అద్దెలపై పన్ను శాతాన్ని తగ్గించినట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గోవాలో మంత్రి అధ్యక్షతన 37వ జీఎస్టీ మండలి సమావేశం జరిగింది.
అద్దెగదులకు జీఎస్టీ తగ్గింపు
7వేల 5వందల వరకూ ఉండే హోటల్ గదుల అద్దెపై జీఎస్టీ రేటును 18 శాతం నుంచి 12 శాతానికి చేసింది కేంద్రం. 7వేల 5వందలకుపైగా ఉండే హోటల్ గదుల అద్దెపై జీఎస్టీ రేటును 28శాతం నుంచి 18 శాతానికి సవరించింది. వెయ్యి రూపాయల వరకూ అద్దె ఉండే హోటల్ గదులపై ఎలాంటి జీఎస్టీ ఉండదని తెలిపింది. చింతపండుపై విధిస్తున్న 5 శాతం జీఎస్టీని పూర్తిగా ఎత్తేశారు. రాయితో కూడిన వెట్ గ్రైండర్లపై పన్ను శాతాన్ని 12 నుంచి 5కు తగ్గించారు.
వివిధ పరిశ్రమ రంగాల్లో తగ్గుదల
నౌకా ఇంధనంపై 18 శాతం ఉన్న జీఎస్టీని 5 శాతానికి పరిమితం చేశారు. స్లైడ్ ఫాస్టనర్స్పై 18 శాతం ఉన్న జీఎస్టీని 12 శాతానికి సవరించారు. దిగుమతి చేసుకునే ప్రత్యేకమైన రక్షణ ఉత్పత్తులపై జీఎస్టీ, ఐజీఎస్టీ మినహాయింపును 2024 వరకూ పొడిగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
శీతల పానీయాలపై పన్ను శాతాన్ని మాత్రం 18 నుంచి 28 శాతానికి పెంచారు.