2020-21 మదింపు సంవత్సరానికి గాను డిసెంబర్ 21 నాటికి 3.75 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నులు దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను విభాగం (ఐటీ) ప్రకటించింది. ఇంకా రిటర్నులు దాఖలు చేయనివారెవరైనా ఉంటే వీలైనంత త్వరగా ఆ పనిని పూర్తి చేయాలని ట్విట్టర్లో కోరింది.
2.17 కోట్ల మంది ఐటీఆర్-1ను, 79.82 లక్షల మంది ఐటీఆర్-4ను, 43.18 లక్షల మంది ఐటీఆర్-3ను, 26.56 లక్షల మంది ఐటీఆర్-2ను దాఖలు చేసినట్లు ఐటీ విభాగం పేర్కొంది.
"వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు 2019-20 ఆర్థిక సంవత్సర (2020-21 మదింపు సంవత్సర) రిటర్ను దాఖలు చేసేందుకు డిసెంబర్ 31తో గడువు ముగియనుంది. ఆడిటింగ్ అవసరమైన వారు రిటర్ను దాఖలు చేసేందుకు 2021 జనవరి 31 వరకు అవకాశముంది" అని ఐటీ విభాగం గుర్తు చేసింది.
నిజానికి ఐటీఆర్ దాఖలుకు తుది గడువు జులై 31తో ముగియాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో దానిని అక్టోబర్ 31 వరకు పెంచింది కేంద్రం. ఆ తర్వాత మరోసారి డిసెంబర్ 31 వరకు పొడిగించింది.
ఇదీ చూడండి:తగ్గిన బంగారం, వెండి ధరలు