వొడాఫోన్-ఐడియా ఎండీ, సీఈఓ రవీందర్ టక్కర్ మూడేళ్ల వరకు ఎలాంటి జీతం తీసుకోకుండా పని చేయాల్సి ఉంటుందని సంస్థ ప్రతిపాదించింది. అయితే, టక్కర్‌కు సంబంధించిన ప్రయాణం, బస, వినోద, ఇతర ఖర్చులను భరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. బోర్డు మీటింగ్స్, ఇతర కమిటీల సమావేశాల్లో పాల్గొన్న సమయంలో ఎలాంటి వేతనాలు చెల్లించదు.
ఈనెల 30న కంపెనీ 25వ వార్షిక సాధారణ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో టక్కర్ నియామకంతో సహా ఇతర ప్రతిపాదనలపై వాటాదారుల ఆమోదం కోరనుంది. ఇప్పటికే వాటాదారులకు నోటీసులను జారీ చేసింది.
బాలేశ్ రాజీనామాతో..
మాజీ ఎండీ, సీఈఓ బాలేశ్ శర్మ రాజీనామా నేపథ్యంలో టక్కర్‌ను ఎంపిక చేసింది వొడాఫోన్ ఐడియా. 2019 ఆగస్టు 19 నుంచి టక్కర్ నియామకం అమల్లోకి వచ్చింది. మూడేళ్ల పాటు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగనున్నారు. 2019-20 సమయంలో సీఈఓగా ఉన్న బాలేశ్.. మొత్తంగా రూ.8.59 కోట్ల జీతంగా పొందారు.
ఆర్థిక ఇబ్బందులు..
ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వొడాఫోన్-ఐడియా.. రూ.58,250 కోట్లు ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ.7,854 కోట్లు మాత్రమే చెల్లించింది. కంపెనీ వినియోగదారుల సంఖ్య కూడా క్రమంగా తగ్గిపోతోంది.
వొడాఫోన్- ఐడియా విలీనం సమయంలో 43 కోట్ల మంది వినియోగదారులు ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 30.9 కోట్లకు పడిపోయింది.
ఇదీ చూడండి: చందా కొచ్చర్ భర్తను అరెస్ట్ చేసిన ఈడీ