టీవీల్లో.. 'అలెక్సా.. ప్లే ది సాంగ్' అంటూ ఆంగ్ల భాషలో యాడ్లు దర్శనమిస్తుంటాయి. ఇప్పటి నుంచి హిందీలోనూ అలెక్సాను పలకరించవచ్చు.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. తన వాయిస్ అసిస్టెంట్ 'అలెక్సా'లో కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఈ కొత్త అప్డేట్ ద్వారా హిందీలో అలెక్సాకు కమాండ్ ఇచ్చి.. కావాల్సిన సేవల్ని పొందొచ్చని అమెజాన్ ఇండియా ప్రకటించింది.
అలెక్సా సేవలను 2017లో ప్రారంభించింది అమెజాన్. తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, పంజాబీలోని ప్రఖ్యాత ప్రాంతాలు, పాటల పేర్లను అలెక్సా గుర్తించగలదు. అయితే యూజర్లు ఇచ్చే కమాండ్లు ఇంగ్లీష్‌లో మాత్రమే అర్థం చేసుకునేది.
తాజా అప్డేట్తో ఇకపై హిందీలో కమాండ్లు ఇచ్చినా అలెక్సా అర్థం చేసుకోగలదు. అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్.. యాపిల్ అసిస్టెంట్ సిరి, గూగుల్ అసిస్టెంట్లకు గట్టిపోటీ ఇస్తోంది. అమెజాన్ స్పీకర్ వంటి ఉత్పత్తులు సహా.. బాస్, మై బాక్స్, ఐ బాల్, సిస్కా వంటి పరికరాల్లోనూ అలెక్సా సేవలు అందుబాటులో ఉన్నాయి.
అలెక్సాలో హిందీ భాషను తీసుకురావడానికి సంస్థ జట్టుతో పాటు ఎంతో మంది అమెజాన్ యూజర్ల సహాయం అందించారని అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు రోహిత్ ప్రసాద్ తెలిపారు. హిందీ పదజాలాన్ని ఎలా పలికినా అలెక్సా అర్థం చేసుకోగలదని చెప్పారు.
"భారత సంప్రదాయ, భాష సంబంధిత వైవిధ్యంతో మేము గట్టి సవాలు ఎదుర్కొన్నాం. అయినప్పటికీ.. వివిధ ప్రాంతాల్లోని హిందీ మాట్లాడే వారి మాటలను సులభంగా అర్థం చేసుకునే విధంగా అలెక్సాలో అప్డేట్ తీసుకొచ్చాం." -రోహిత్ ప్రసాద్,అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు.
ఇదీ చూడండి: పెట్రోల్, డీజిల్ ధరలు పైపైకి.. ఒక్కరోజే..!