సాధారణంగా ఎంఎస్‌ఎంఈ యూనిట్లు వర్క్ ఆర్డర్లు లభించిన వెంటనే కావాల్సిన ముడిసరకును రుణంపై తెచ్చుకుంటాయి. ఆర్డరు ఇచ్చిన సంస్థలు కొంత అడ్వాన్సు కూడా చెల్లించేవి. వాటితో చాలా వరకూ పని జరిగేది. కానీ 'కరోనా' తర్వాత ఈ పరిస్థితి మారిపోయింది. తమకు బిల్లు రాదనే భయంతో ముందుగా డబ్బు ఇస్తేనే ముడిసరుకు పంపుతామని సరఫరాదార్లు తేల్చిచెబుతున్నారని సమాచారం. పని ఎప్పటికి పూర్తి అవుతుందో తెలియకపోవడంతో ఆర్డర్‌పై అడ్వాన్సు ఇచ్చేది లేదని అర్డర్లు ఇచ్చిన సంస్థలూ మొండికేస్తున్నాయి. కరోనాకు ముందు పూర్తి చేసిన వర్క్ ఆర్డర్లకు సంబంధించిన బిల్లులు కూడా భారీఎత్తున పేరుకుపోయాయని తెలుస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు సంస్థల నుంచి ఎంఎస్‌ఎంఈలకు రూ.5 లక్షల కోట్ల మేర బిల్లులు రావాల్సి ఉందని స్వయానా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీయే ప్రకటించడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల నుంచి తరలిన కార్మికులు
కార్మికులు పెద్ద సంఖ్యలో వలస వెళ్లిపోవటం ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు నష్టం చేస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగుళూరు, చెన్నై, ముంబయి, పుణె, దిల్లీ ఎన్‌సీఆర్... తదితర నగరాల్లోని యూనిట్లలో పనిచేస్తున్న కార్మికులు ‘లాక్‌డౌన్’ ఇబ్బందులను తట్టుకోలేక స్వస్థలాలకు వెళ్లిపోయారు. వారిలో ఎంతమంది, ఎప్పటికి తిరిగి వస్తారనేది తెలియటం లేదు.ఈ పరిస్థితుల్లో కార్మికులు లేక యూనిట్లు తెరవని నిర్వాహకులూ కనిపిస్తున్నారు. 'అన్ని పనులు నేనొక్కడినే చేసుకోవాల్సి వస్తోంది. యూనిట్ రెండు రోజులు తెరిచి, తర్వాత మూసివేశాను' అని హైదరాబాద్ సమీపంలో సిమెంటు టైల్స్ తయారు చేసే యూనిట్ నిర్వాహకుడు ఒకరు తెలిపారు. సూక్ష్మ యూనిట్లలో 70- 80% వలస కార్మికులతోనే నడుస్తున్న విషయం గమనార్హం.
గత రెండు నెలల్లో 'సప్లై చైన్' తెగిపోయింది. ప్రతి ఒక్క దశలో పని మళ్లీ కొత్తగా మొదలు కావాలి. అందువల్ల పరిస్థితులు సర్దుకోడానికి నాలుగైదు నెలలైనా పడుతుందని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు కష్టాలు తప్పవు. ముడి సరకు, విడిభాగాల కోసం దేశీయ యూనిట్లు చైనాపై అధికంగా ఆధారపడుతున్నాయి. అవి మనదేశంలో దొరుకుతున్నప్పటికీ, కొంత ఖర్చు తక్కువ కావడం, చైనా వస్తువుల సప్లై చైన్ వ్యవస్థ బలంగా ఉండటం వల్ల వాటిని ఇక్కడి ఎంఎస్‌ఎంఈలు అధికంగా వినియోగిస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు దేశీయంగా తయారైన విడిభాగాలు, ముడిపదార్థాలు వినియోగించే యూనిట్లకు రాయితీలు కల్పించాలని స్థానిక పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. చైనా విడిభాగాల మీద పన్ను భారం పెంచి వాటిని నిరుత్సాహపరచాలని సూచిస్తున్నాయి. పూర్తిగా స్వదేశీ తయారీ వస్తువులనే కొనుగోలు చేసేలా నిబంధనలు తేవాలని కోరుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంఎస్‌ఎంఈ రంగం కోలుకోవాలంటే జీఎస్‌టీ మినహాయింపు ఇవ్వటం తప్పనిసరిగా స్థానిక వర్గాలు భావిస్తున్నాయి. కనీసం చెల్లింపు గడువు బాగా పెంచటం అయినా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్దీపన
ఎంఎస్‌ఎంఈలను ఆదుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉద్దీపన పథకాన్ని ప్రకటించింది. అదనపు రుణ సదుపాయం, నిర్వహణ నిధుల లభ్యత పెంపొందించటం వంటి చర్యలు ఇందులో ఉన్నాయి.
అత్యవసర నిర్వహణ నిధుల కోసం రూ.3 లక్షల కోట్ల కేటాయింపు. రుణభారానికి తోడు నష్టాల్లో కూరుకుపోయిన ఎంఎస్‌ఎంఈలకు 'సబార్డినేట్ రుణం' కింద రూ.20,000 కోట్ల నిధి. ఎంఎస్‌ఎంఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా ఈక్విటీ పెట్టుబడి కోసం రూ.50,000 కోట్లు మంజూరు.
రూ.200 కోట్ల వరకు ప్రభుత్వ పనులకు గ్లోబల్ టెండర్లు ఇవ్వరాదని నిర్ణయం. తద్వారా ఈ టెండర్లలో దేశీయ ఎంఎస్‌ఎంఈ సంస్థలు పాల్గొని పనులు దక్కించుకునే అవకాశం వస్తుందని అంచనా.
ఈపీసీ, కన్సెషన్ ఒప్పందాలతో సహా చేతిలో ఉన్న పనులు పూర్తిచేసేందుకు కాంట్రాక్టింగ్ కంపెనీలకు 6 నెలల వరకు గడువు పొడిగింపు.
మార్గదర్శకాలు విడుదల
ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ఆదుకునేందుకు రూ.3 లక్షల కోట్ల పూచీకత్తు లేని రుణాలు ఇవ్వాలని బ్యాంకులను ప్రభుత్వం కోరింది. వీటికి ప్రభుత్వమే పూర్తిగా హామీ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. సిబిల్ స్కోర్ బాగున్న సంస్థల నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండానే రుణం మంజూరు చేసేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుకొస్తున్నాయి. దీంతోపాటు పనితీరు బాగున్న ఎంఎస్‌ఎంఈల సమాచారం ఇవ్వమని కూడా సంబంధిత అధికారులను బ్యాంకులు కోరుతున్నట్లు సమాచారం. కానీ ఇప్పటికే ఆర్థికంగా ఒత్తిడిలో ఉన్న సంస్థలకు, నష్టాల పాలై కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న సంస్థలు ఈ రకమైన ఆర్థిక మద్దతు లభించే అవకాశం కనిపించటం లేదు.
సత్వరం పుంజుకుంటాయని..
ఇంత కష్టకాలంలోనూ ఆశ కోల్పోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు. కష్టాలు ఎదురైనపుడు ఎంతగా కుంగిపోయినప్పటికీ మళ్లీ పనులు ప్రారంభం అయితే అంతే వేగంగా కోలుకుంటామని కొన్ని ఎంఎస్‌ఎంఈ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే యూనిట్లు తెరుచుకుంటున్నాయని, 3-6 నెలల వ్యవధిలో సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వ శాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని యూనిట్లు మూతపడే ప్రమాదం లేదా... అనే ప్రశ్నకు అవునంటూనే, అదే సమయంలో కొత్త రంగాల్లో వ్యాపార అవకాశాలు అందివస్తాయని, అక్కడ కొత్త యూనిట్లు, కొత్త ఉద్యోగాలు లభిస్తాయని వివరిస్తున్నాయి.
ఎంఎస్‌ఎంఈ రంగం విశ్లేషణ
- వార్షిక టర్నోవర్ రూ.25 లక్షల వరకు ఉన్న సంస్థలను సూక్ష్మ తరగతికి చెందిన యూనిట్లుగా పరిణిస్తున్నారు. రూ.25 లక్షలు-5 కోట్ల వరకూ టర్నోవర్ కల సంస్థలు చిన్న తరహా యూనిట్లు కాగా, రూ.5 -10 కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు మధ్యతరహా యూనిట్లుగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా దాదాపు 6.5 కోట్ల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉంటాయని అంచనా. అందులో 90 శాతం సూక్ష్మ యూనిట్లే ఉంటాయి. కరోనా కష్టాలు సూక్ష్మ యూనిట్లకే అధికంగా ఉన్నాయి.
- స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఎంఎస్‌ఎంఈ యూనిట్ల వాటా 29 శాతం ఉంటుంది. మనదేశం నుంచి నమోదయ్యే ఎగుమతుల్లో దాదాపు సగభాగం ఈ విభాగానికి చెందిన యూనిట్ల నుంచే నమోదవుతున్నాయి.
- రాష్ట్రాల వారీగా చూస్తే ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మొదటి 10 రాష్ట్రాల జాబితాలో ఉంటాయి.
- తెలంగాణలో ఈ తరహా యూనిట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. హైదరాబాద్‌లోని 5-6 క్లస్టర్లలోనే వేల సంఖ్యలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
- ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 26 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉన్నాయి. ఈ యూనిట్లలో దాదాపు 70 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఉపాధి కల్పన విషయంలో ఎంఎస్‌ఎంఈ రంగానికి రాష్ట్రంలో మూడో స్థానం.
- ఈ తరహా యూనిట్లకు ప్రధాన సమస్య రుణ లభ్యత తగినంతగా లేకపోవటమే. కరోనా ‘లాక్‌డౌన్’ విధింపునకు ముందే ఎంఎస్‌ఎంఈ యూనిట్ల ఆర్థిక పరిస్థితి బాగా లేదు. లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయి ఇంకా నష్టం జరిగింది. ఉద్యోగాల నష్టం సరేసరి. లాక్‌డౌన్ తర్వాత కొన్ని యూనిట్లు ప్రారంభం కావని, ఆ మేరకు ఉద్యోగాలు పోయినట్లేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉత్పత్తి రంగంలో ఉన్న యూనిట్లకు నష్టం అధికంగా ఉంది.
ప్రధాన ఇబ్బందులు
- వ్యాపార నష్టం
- 'వర్కింగ్ కేపిటల్' కొరత
- కార్మికుల వలసలతో పనులు కుదేలు
- ఈఎంఐ వాయిదా, తర్వాతైనా ఎలా కట్టాలి?
- అద్దె చెల్లింపు, కార్మికులకు మూడు నెలల వేతనాల చెల్లింపు పెను భారం
- ప్యాకేజీ అండ కొంతమేరకే