రిలయన్స్ ఇండస్ట్రీస్ తన డిజిటల్, వైర్‌లెస్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ను విదేశాల్లో లిస్టింగ్ చేయాలనే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే 10 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.78,000 కోట్ల) పెట్టుబడులను ఆకర్షించిన జియో ప్లాట్‌ఫామ్స్‌ను భారత్ వెలుపలి స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేయాలని రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీ భావిస్తున్నట్లు సమాచారం.
12-24 నెలల్లోనే..
రాబోయే 12-24 నెలల్లో ఈ ఇష్యూ రావొచ్చని అనుకుంటున్నారు. అయితే ఎక్కడ నమోదు చేయాలన్నది కంపెనీ ఇంకా నిర్ణయించలేదని ఈ వ్యవహారాలతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి తెలిపారు. సమయం, ఇష్యూ పరిమాణంపై ఇంకా తుది నిర్ణయం జరగలేదని వివరించారు. ఫేస్‌బుక్, సిల్వల్ లేక్ పార్టనర్స్, జనరల్ అట్లాంటిక్‌ల తర్వాత తాజాగా జియో ప్లాట్‌ఫాయ్స్‌లో కేకేఆర్ అండ్ కో పెట్టుబడులు పెట్టింది.
విదేశాల్లో లిస్టింగ్ వల్ల అధిక విలువ దక్కవచ్చని, ప్రస్తుత పెట్టుబడుదార్లు నిష్క్రమించడానికి, ఇలా ఒక అవకాశం ఇవ్వవచ్చని ఆ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి ఈ వ్యవహారంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.
200 నగరాల్లో రిలయన్స్ జియోమార్ట్
రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ ఆన్‌లైన్ సరకుల వ్యాపారాన్ని జియోమార్ట్ బ్రాండ్ కింద 200 నగరాల్లో ప్రారంభించింది. ప్రధాన మెట్రో నగరాలు ముంబయి, దిల్లీ, బెంగళూరు, కోల్‌కతాలతో పాటు మైసూరు, భటిండా, దెహ్రాదూన్ వంటి చిన్న పట్టణాల్లోనూ సేవలు అందిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. జియో మార్ట్ ఇప్పుడు 200కు పైగా నగరాల్లో సేవలు అందిస్తోందని రిలయన్స్ రిటైల్ (గ్రోసరీ విభాగం) సీఈఓ దామోదర్ మాల్ తెలిపారు.